తెలంగాణలో ముగిసిన పరిషత్‌ ఎన్నికలు.. ఆ జిల్లాలోనే అత్యధిక శాతం పోలింగ్‌..

తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం జరిగిన ఆఖరి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ విడుతలో రాష్ట్రంలోని 27 జిల్లాలో 161 జడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా.. 30 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 160 జడ్పీటీసీ, 1708 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. తొలివిడతలో వాయిదాపడిన సిద్దిపేట జిల్లాలోని అల్వాల్, రంగారెడ్డి జిల్లాలోని అజీజ్‌నగర్ ఎంపీటీసీ స్థానాలకు కూడా చివరి విడతతో పాటే పోలింగ్ నిర్వహించారు.

ఈ విడుతలో 77.81 శాతం పొలింగ్‌ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 88.40 శాతం నమోదు కాగా… నారాయణపేటలో అత్యల్పంగా 68.53 శాతం ఓటింగ్‌ రికార్డయింది. దీంతో మూడు విడుతలుగా మొత్తం 538 జెడ్టీపీసీ, 5,817 ఎంపీటీసీలకు పోలింగ్‌ ముగిసినట్లైంది. ఈ నెల 6న తొలిదశ పోరులో 76.80 , ఈ నెల 10న జరిగిన రెండో విడుతలో 77.63 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. తుదివిడుతలో ఓట్ల చైతన్యం వెల్లవిసిరింది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలు కాగా.. ..ప్రారంభం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలొచ్చారు. అయితే..కొన్ని ప్రాంతాల్లో ఎండ ధాటికి మధ్యాహ్నం వేళ పోలింగ్ మందకొడిగా సాగినా.. సాయంత్రానికి తిరిగి పుంజుకుంది. మరోవైపు మావోయిస్టు ప్రాబల్యం ఉన్న కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని 205 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ 4 గంటలకే ముగిసింది. ఓట్ల లెక్కింపు ఈ నెల 27న జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.

Recommended For You