వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య..

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించింది ఓ మహిళ. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. దొడ్డబళ్లాపురం బాగేపల్లికి చెందిన శ్రీనివాస్(27), ప్రతిభకు పదేళ్ల కిందట వివాహం జరిగింది. వారి ఇద్దరు సంతానం. ఉద్యోగ రీత్యా సంసారాన్ని అనేకల్‌ తాలూకా హిలలిగె గ్రామానికి వలస వచ్చారు శ్రీనివాస్. ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. అయితే ప్రశాంతంగా సాగిపోతున్న వారి సంసార జీవితంలోకి బాలకృష్ణ అనే వ్యక్తి ప్రవేశించాడు. బాలకృష్ణ తన భార్యతో కలిసి శ్రీనివాస్ ఇంటి పక్కనే నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రతిభకు బాలకృష్ణ పరిచయమయ్యాడు. వారి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

దాంతో బాలకృష్ణ భార్య లక్ష్మికి విషయం తెలిసి రోజు గొడవ చేస్తుంది. అయినా అతను వినలేదు. చేసేదిలేక బాలకృష్ణ, ప్రతిభ ల అనైతిక బంధం గురించి శ్రీనివాస్ కు చెప్పింది. అతను భార్యను తీవ్రంగా మందలించాడు. తమ ఆనందానికి అడ్డుగా శ్రీనివాస్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్రతిభ, తన భార్యను కూడా చంపేయాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా బాలక్రిష్ణ తన భార్య లక్ష్మిని, ప్రతిభ తన భర్త శ్రీనివాస్‌ను ఉద్యోగం ఒకటి ఉందని నమ్మించి చందాపుర సమీపంలోని సూర్యనగర్‌ బీఎంటీసీ బస్‌ డిపో వద్దకు తీసుకువచ్చి.. ఇద్దరు కలిసి శ్రీనివాస్‌ను కత్తితో గొంతుకోసి చంపారు. అనంతరం అక్కడే ఉన్న నీళ్లలో మృతదేహాన్ని విసిరేశారు. ఆ తరువాత లక్ష్మిని కూడా చంపాలని అనుకున్నా కుదరలేదు. ఇంతలో బాలకృష్ణ భయంతో ఊరు వదిలి పారిపోయాడు. లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Recommended For You