తాగుబోతు డ్రైవర్లకు కోర్టు శిక్ష

తాగుబోతు డ్రైవర్లకు కోర్టు శిక్ష వేసింది. కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద బుధవారం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో జీవీఆర్‌, శ్రీ వెంకట పద్మావతి, శ్రీకనకదుర్గ ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లు మద్యం సేవించి పట్టుబట్టారు. వారిని అదుపులోకి తీసుకుని ట్రావెల్స్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈకేసులో వెంకటపద్మావతి ట్రావెల్స్‌ డ్రైవర్‌ బుజ్జికి జైలు శిక్షపడింది. పది రోజులు జైలు శిక్ష, లైసెన్స్‌ దద్దు చేశారు నందిగామ రెండవ మెజిస్ట్రేట్ ఆకుల సత్యనారాయణ.

ఫుల్లు‌గా మందు కొట్టి బస్సులు నడుపుతున్నారు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ డ్రైవర్లు. నిన్న కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మూడు ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు డ్రైవర్లు అడ్డంగా దొరికిపోయారు. తాజాగా ఆదే జిల్లాలో పొట్టిపాడు టోల్‌ గేట్ వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్‌ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్‌ చేయగా మరోకరు పట్టుబడ్డాడు. ఈ బస్‌ గుంటూరు నుంచి విశాఖ వెళ్తున్న వరుణ ట్రావెల్స్‌ చెందినదిగా గుర్తించారు. డ్రైవర్‌ బస్సు నడుపుతున్న సమయంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడంతో ఆ బస్‌ను వేరే డ్రైవర్‌కు ఇచ్చి పంపించారు అధికారులు.

అటు తప్పతాగి డ్రైవింగ్ చేస్తున్న ప్రైవేట్‌ టావెల్స్ బస్‌ డ్రైవర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు బెజవాడ పోలీసులు. నగరంలోని ప్రధాన పాయింట్లలో ప్రతి బస్‌ను తనిఖీ చేస్తున్నారు. అయితే కొందరు ప్రైవేట్ బస్‌ డ్రైవర్లు సాయంత్రం విజయవాడ సిటీ దాటిన తర్వాత దాబా సెంటర్లతో మద్యం తాగుతున్నారు. దీంతో దాబా సెంటర్లపై కూడా తనిఖీలు చేపట్టాలని విజయవాడనగర పోలీస్‌ కమిషనర్ ద్వారక తిరుమలరావు ఆదేశించారు.

అటు తమ డ్రైవర్లు సుశిక్షితులని, జాగ్రత్తగా ప్రయాణికులను గమ్యస్థానాలను చేరుస్తామంటూ ప్రకటనలతో ఊదరగొడుతున్న ఆర్టీసీ తక్కువేం కాదు. డ్రైవర్ల నిర్లక్ష్యంతో భూపాలపల్లి వెళ్తున్న గోదావరిఖని డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు సోమన్‌పల్లి మానేర్‌ బ్రిడ్జి సమీపంలో అదుపు తప్పి ఫల్టీ కొట్టింది. రోడ్డు పక్కనున్న 8 మీటర్ల గుంతలోకి పడిపోయింది. దీంతో 60 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు నడిపేటప్పుడు స్టీరింగ్‌ను వదిలేసి, గుట్కా వేసుకోబోయాడని, ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైందన్నారు.

నిర్లక్ష్యంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా డ్రైవర్లు మొద్దు నిద్ర వీడడం లేదు. అధికారులు తనిఖీలు చేస్తున్న వారి తీరులో మార్పు రావడంలేదు. ప్రయాణికులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బస్సు ఎక్కాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది.

Recommended For You