జైల్లో దొంగలు పడ్డారు.. నేరస్తుల ఆభరణాలు మాయం..

దొంగతనం చేస్తే, శిక్ష విధించి జైలుకు పంపిస్తారు. మరి జైళ్లోనే దొంగలుంటే ఏం చేస్తారు…? అది కూడా భద్రంగా ఉంచాల్సిన నేరస్తుల ఆభరణాలను జైలు అధికారులు కొట్టెస్తే ఎలా ఉంటుంది..? ఈ విచిత్ర పరిస్థితి ప్రణయ్‌ హత్య కేసులో నిందితులైన మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌లకు ఎదురైంది. గత ఏడాది సెప్టెంబరు 14న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు కోసం జరిగిన ప్రణయ్‌ హత్య సంచలనం సృష్టించింది. ఈ కేసులో మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌ కుమార్‌తో పాటు ఆరుగురిని పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే నిందితుల్లో ముగ్గురికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో మారుతీరావు, శ్రవణ్, ఖరీం వరంగల్‌ జైలు నుంచి విడుదలయ్యారు.

ప్రణయ్‌ హత్య కేసులో రిమాండ్‌ లో ఉన్నప్పుడు నల్గొండ జైలు అధికారులు శ్రవణ్ చేతికి ఉన్న 3 ఉంగరాలు తీసుకొని భద్రపరిచారు. బెయిల్‌ పై విడుదలయ్యాక ఆయన తన ఉంగరాలు కోసం నల్గొండ జిల్లా జైలుకు వెళ్లాడు. దీంతో అవి మాయమైన విషయం వెలుగుచూసింది. దీంతో ఉంగరాలు పోయాయంటూ జైలు సూపరింటెండెంట్ కృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటి విలువ సుమారు 6 లక్షల దాకా ఉంటుందని చెప్పారు శ్రవణ్ . నల్గొండ జైలర్ జలంధర్ యాదవ్‌ పై అనుమానాలున్నట్టు సమాచారం. జైళ్లు సత్ప్రవర్తనకు నిలయాలని చెబుతారు. తప్పు చేసిన వారిలో మార్పు కలిగించడానికి అక్కడికి తరలిస్తారు. కంచే చేను మేసినట్టు జైలు అధికారులే తప్పు చేస్తే, ఇక ఖైదీల్లో మార్పు ఎలా తీసుకొస్తారనే ప్రశ్న తలెత్తోతంది.

Recommended For You