అకాశాన్నంటుతున్న టమాటా ధరలు.. కారణం ఇదే..

ఈ వేసవిలో ఎండలతో పాటు కూరగాయల ధరలు కూడా మండుతున్నాయి. ముఖ్యంగా అన్ని వంటకాల్లో వినియోగించే టమోటా ధరలు అకాశాన్నంటుతున్నాయి. నీటి లభ్యత లేకపోవటంతో అశించిన స్థాయిలో దిగుబడి రావడంలేదు. రాష్ట్రాంలోనే టమోటాకు ప్రధాన కేంద్రమైన మదనపల్లె మార్కెట్‌కు గడచిన కొద్ది రోజులుగా టమాటాలు రావడం లేదు. దీంతో.. బహిరంగ మార్కెట్ లో కిలో టమోటాల ధర 60 రూపాయలు పలుకుతోంది.. మదనపల్లి మార్కెట్‌లో దళారులు రైతుల వద్ద కిలో 30 నుంచి 40 రూపాయల వరకు కొనుగోలు చేసి వ్యాపారస్థులకు అధిక ధరలకు అమ్మి లాభాలు ఆర్జిస్తున్నారు.

సీజన్‌ను బట్టి టమోటా కిలో ధర 10 పైసల నంచి 100 రూపాయ వరకూ పెరుగుతుంది. నెల రోజుల క్రితం వరకు కిలో 10 నుంచి 15 రూపాయల లోపు ఉన్న టమోటా ధర నేడు 50 నుంచి 60 రూపాయలకు చేరింది. గత సంవత్సరం మే నెలలో 400 నుంచి 500 టన్నుల టమోటాలు మదనపల్లి మార్కెఠ్‌కు వచ్చాయి. అయితే ..ఈ సంవత్సరం 180 నుంచి 190 టన్నుల టమోటాలు మాత్రమే రావడం ఆందోళన కలిగిస్తోంది. దిగుబడి భారీగా తగ్గడంతో టమోటా ధరలు అమాంతం పెరిగిపోయాయి.

పండించిన పంట చేతికందే సమయంలో నీరు లేక టమాటా పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో..రైతులు ఆ పంటను పోలాల్లోనే వదిలేస్తున్నారు. కాస్తో కూస్తో నీటి సౌలభ్యం ఉన్న రైతులు తాము పండించిన టమాటా పంటను మార్కెట్ కు తీసుకుని వస్తే వ్యాపారస్తులు తక్కువ ధరలకు కొని రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. టామోటా పంటపై వచ్చిన లాభాన్నిరైతులు తమ పొలాల్లో బోర్లు వెయ్యడానికే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం 500 నుంచి 700 అడుగుల వరకు బోర్లు వేసినా చుక్కనీరు కూడా రాని పరిస్థితి కనిపిస్తోంది. పండించిన టమాటా పంటను నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజిలు, పల్ప్ ఫ్యాక్టరీలు లేకపోవడంతో వ్యాపారస్థులు అడిగిన ధరలకు విక్రయించాల్సి వస్తోందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో పలుకుతోన్న టమాటా ధరల్లో కనీసం సగం కూడా రైతులకు చేరడం లేదు.

Recommended For You