లోకం పోకడలు ఎరుగని బాలిక.. మూర్ఖుల నిర్ణయానికి తలొగ్గి ఆత్మహత్య..

నేను చనిపోవాలా? వద్దా?… ఇదే విషయం ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? వద్దంటారా.. చనిపొమ్మంటారా. ఎవరైనా వద్దనే అంటారు. కానీ మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో అలా అనలేదు. ఫలితంగా 16 ఏళ్ల బాలిక ఎత్తైన బిల్డింగ్‌ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. టీనేజ్ బాలిక ఆత్మహత్య చేసుకుంది అనే కంటే… నెటిజన్లు ఆమెను హత్య చేశారు అనడమే కరెక్ట్. ఎందుకంటే… చనిపోవాలంటూ వారంతా ప్రేరేపించారు.

ఈ విషాదం వెనుక… దారుణం దాగుంది. అయినదానికీ కానిదానికి ఓవర్‌గా రియక్ట్ అయ్యే నెటిజన్ల పాపం ఉంది. బతికి ఉండడానికి తాను అర్హురాలినా…కాదా అంటూ ఇన్‌స్టాగ్రాంలో ఆ బాలిక పోస్ట్ చేసింది. తాను చనిపోవాలా? వద్దా? అంటూ పోల్ పెట్టింది. D, L అనే రెండక్షరాలను అందుకు సంకేతంగా ఉంచింది. చనిపోవాలని మీరు భావించినట్లైతే D అంటే డైకి ఓటేయండి. నేను జీవించివుండాలని మీరు అనుకున్నట్లయితే… L అంటే లివ్‌కి ఓటేయండి అని కోరింది.

ఇలాంటి పోస్టును చూస్తే ఎవరైనా ఏం చేస్తారు? ముందుగా పోలీసులకు సమాచారం ఇస్తారు. ఆ బాలిక ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తారు. L అంటే జీవించివుండూ అనేదానికి ఓటేస్తారు. కానీ మలేషియాలో మానవత్వంలేని కొందరు నెటిజన్లు ఇలాంటి ప్రయత్నమేమీ చేయలేదు. పైగా చనిపోవాలంటూ 69 శాతం మంది ఓటేశారు. బతకాలంటూ కేవలం 31 శాతం మంది మాత్రమే ఓటేశారు. ఎక్కువ మంది ఆమె చావునే కోరుకున్నారు. లోకం పోకడలు ఎరుగని ఆ బాలిక… మూర్ఖుల నిర్ణయానికి తలొగ్గింది. చనిపోవాలని డిసైడ్ అయింది. పెద్ద బిల్డింగ్ పైనుంచి జంప్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణంపై కేసు నమోదు చేసిన పోలీసులు… కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోడానికి ఆరా తీస్తున్నారు. కొంతమంది నెటిజన్లు మూర్ఖత్వానికి ఓ బాలిక బలికావడం ఎంతోమందిని కలిచివేస్తోంది.

Recommended For You