కాలేజ్‌ హాల్‌ నుంచి బయటకు పరుగెత్తిన యువతి.. తండ్రిని కౌగిలించుకొని..

కాలేజ్‌ హాల్‌ నుంచి బయటకు పరుగెత్తిన యువతి.. తండ్రిని కౌగిలించుకొని..

అందరిలా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అమ్మాయి.. అందరిలా సెలబ్రేట్ చేసుకోలేదు. కన్నీటి సుడులతో ఆ హాల్ నుంచి బయటకు పరిగెత్తింది. దేశ బోర్డర్‌ వరకు వెళ్లిపోయింది. అమెరికాలోని టెక్సాస్‌లో హైస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన సరాయి రూయిజ్ పట్టా చేతికి అందగానే వెంటనే బయటకు పరుగులు తీసింది. దీంతో అక్కడ ఉన్నవారికి ఏం జరిగిందో అర్థం కాలేదు. పట్టా చేత పట్టుకుని ఆ విద్యార్థిని నేరుగా బోర్డర్‌లోని ఓ బ్రిడ్జీ వద్ద ఆగింది. తన కోసం ఎదురు చూస్తున్న ఓ వ్యక్తిని కౌగిలించుకొని కన్నీరు పెట్టుకుంది. అది చూసిన అక్కడి వారికి అసలేమి అర్థం కాలేదు.

సరాయి రూయిజ్ తన ఆనంద క్షణాలను ఆ వ్యక్తితో పంచుకోవడానికి కారణమేంటీ… అక్కడున్నవారి మదిలో మెదిలిన ప్రశ్న. తర్వాత అసలు విషయం తెలిసి వారి గుండెలు బరువెక్కాయి.

బ్రిడ్జీ దగ్గర అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న ఆ వ్యక్తి ఎవరో కాదు.. రూయిజ్ కన్నతండ్రి. దశాబ్దం క్రితం దేశ బహిష్కరణకు గురయ్యాడు. దీంతో మెక్సికో వెళ్లిపోయిందా కుటుంబం. అప్పటి నుంచి తండ్రి అమెరికాలో అడుగుపెట్టలేదు. కూతురు రూయిజ్ రోజు బార్డర్‌ దాటి టెక్సాస్‌లోని లారెడొలో స్కూల్‌కు వెళ్లి వస్తుంది. గ్రాడ్యుయేషన్‌ డే రోజు కూడా తన తండ్రి సరిహద్దులు దాటి రాలేకపోయాడు. అందుకే, తానే తండ్రి వద్దకు వెళ్లి ఇలా సెలబ్రేట్ చేసుకుంది.

దశాబ్దకాలంగా తన కోసం తండ్రి పడుతున్న వేదనను బయటి ప్రపంచానికి తెలిజేయాలని నిర్ణయించుకుంది రూయిజ్‌. దీనికి గ్రాడ్యుయేషన్ డేను వేదిక చేసుకుంది. తాను తన తండ్రిని కలుసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో తీయమని స్నేహితురాలికి ముందే చెప్పింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story