తాజా వార్తలు

ప్రసాదంలో పురుగులు... ఇద్దరు అధికారులు సస్పెండ్‌

ప్రసాదంలో పురుగులు... ఇద్దరు అధికారులు సస్పెండ్‌
X

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.. ఆలయంలో విక్రయించిన లడ్డూ ప్రసాదంలో పురుగులు కనిపించడం కలకలం రేపింది.. అయితే, ఫిర్యాదు చేసినా అధికారులు లైట్‌ తీసుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతో బాసర క్షేత్ర పవిత్రత మంటగలుస్తోంది.. ఎన్నిసార్లు భక్తుల ఆగ్రహానికి గురైనా వారి తీరులో మార్పు రావడం లేదు.. భక్తులు ఎంతో పరమ పవిత్రమైనదిగా భావించే ప్రసాదాల విషయంలో అధికారులు అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.. తాజాగా లడ్డూ ప్రసాదంలో పురుగు కనిపించడం కలకలం రేపింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం విమర్శలకు తావివస్తోంది.

సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు బాసర వెళ్లిన భక్తులు ఆలయ కౌంటర్‌లో లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేశారు.. ఆ ప్రసాదాన్ని తింటుండగా మధ్యలో పురుగులు కనిపించాయి. దీంతో వారు షాక్‌కు గురయ్యారు.. వెంటనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, వారు ఏమాత్రం పట్టించుకోలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాసర ఆలయంలో ప్రసాదంలో పురుగులు ప్రత్యక్షం కావడం ఇదేం మొదటిసారి కాదు.. గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.. ప్రసాదంలో పురుగులతో పాటు చెత్త కనిపించడంతో కలకలం రేగింది. ఆ ఘటనపై సీరియస్‌గా రియాక్ట్‌ అయిన ఉన్నతాధికారులు ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేశారు.. ఆ తర్వాత మరోసారి ప్రసాదంలో పురుగులు రావడంతో అప్పుడు కూడా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు.. తాజాగా అదే పునరావృతం కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఆదాయంపై పెట్టే దృష్టి నాణ్యతపై పెట్టడం లేదని అంటున్నారు.. ప్రసాదాల విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఎలా అంటూ మండిపడుతున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

Next Story

RELATED STORIES