తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. గంటకు 50కి.మీ. వేగంతో..!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. గంటకు 50కి.మీ. వేగంతో..!

తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వరుణుడు కరుణించనున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుంది. ఇది రానున్న 24 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా మారొచ్చని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాల్లోభారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలు తడిసిముద్దయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా గన్నవరంలో 41 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

అల్పపీడన ప్రభావంతో ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45-50కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి.దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దిన వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని విపత్తుల శాఖ హెచ్చరిక జారీచేసింది. మరోవైపు తీరప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వాతావరణశాఖ హెచ్చరికలతో ఆయా విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు.ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకున్నాయి. అయితే ఈ వాయుగుండం ప్రభావంతో రుతుపవనాలు మరింత చురుకుగా కదిలే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story