ఎప్పటికీ మందకృష్ణకు ఆత్మీయుడినే: కేంద్ర సహాయమంత్రి

ఎన్ని సమస్యలు ఎదురైనా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాత్రం ఉద్యమబాట వీడలేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. ప్రకాశం జల్లా ఈదుమూడిలో జరిగిన ఎమ్మార్పీఎస్ 25వ వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ సాగిస్తున్న అలుపెరగని పోరాటానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.

ఆత్మగౌరవ నినాదంతో ప్రకాశం జిల్లాలో పురుడు పోసుకున్న ఎమ్మార్పీఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఎస్సీ వర్గీకరణ ఉద్యమ పురిటిగడ్డ ఈదుమూడిలో మందకృష్ణ ఆధ్వర్యంలో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా పాతికేళ్లుగా ఓ లక్ష్యం కోసం పోరాడుతున్న సంస్థ MRPS అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడిలో జరిగిన MRPS ఆత్మగౌరవ సభకు.. కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణే ఏకైక అజెండాగా మందకృష్ణ చేస్తున్న పోరాటం సాటిలేనిదని ఆయన కొనియాడారు. తాను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు .. ఈ అంశంపై సభలో ప్రస్తావించానని తెలిపారు. కేంద్రమంత్రి అయ్యాక తాను దూరమయ్యానని భావించవద్దని.. తాను ఎప్పటికీ మందకృష్ణకు ఆత్మీయుడినే అని కిషన్‌ రెడ్డి అన్నారు.

ప్రజల పక్షాన MRPS ఎన్నో ఉద్యమాలు చేసిందని మందకృష్ణ మాదిగ అన్నారు. అణగారిన వర్గాలు నేడు సగౌరవంగా తల ఎత్తుకుని తమ అస్తిత్వాన్ని చాటుతున్నారంటే దానికి MRPS పోరాటాలే కారణమన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి.. రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని మందకృష్ణ డిమాండ్‌ చేశారు. మాదిగల ఆత్మగౌరవ సభలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.

Tags

Read MoreRead Less
Next Story