క్లైమాక్స్‌‌కు చేరిన కర్ణాటక సంక్షోభం

కర్ణాటక సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరుకు చేరుకున్నారు. రోషన్ బేగ్, మునిరత్నం సహా 16 మంది అసంతృప్త శాసనసభ్యులు, కాసేపటి క్రితం అసెంబ్లీకి వచ్చారు. ఇందులో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగా, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు. ఇక, స్పీకర్ సురేష్‌ కుమార్‌ కూడా అసెంబ్లీకి వచ్చారు. కాసేపట్లో స్పీక ర్‌తో రెబల్ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌ను కోరనున్నారు.

ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. చివరి ప్రయత్నంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అస్త్రం సంధించారు. నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ కోరింది. ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని జేడీఎస్ కోరింది. ఈ మేరకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు స్పీకర్ సురేష్‌ కుమార్‌కు పిటిషన్ ఇచ్చారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడానికి ముందే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

మరోవైపు, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలని కర్ణాటక మంత్రివర్గం తీర్మానించింది. అవసరమైతే విశ్వాస పరీక్షకు కూడా సిద్ధమని కేబినెట్ ప్రకటించింది. సీఎం పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. డీకే కూడా కుమారస్వామికి అండగా నిలిచారు. సీఎం పదవి నుంచి కుమారస్వామి తప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ఇదిలా ఉంటే, బీజేపీ శాసనసభాపక్షం అత్యవసరంగా సమావేశమైంది. విధానసౌధలోని పార్టీ చాంబర్‌లో మాజీ సీఎం యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై బీజేపీ నేతలు సమాలోచనలు జరిపారు.

Tags

Read MoreRead Less
Next Story