తాజా వార్తలు

ఆదివాసీలకు మద్దతుగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తోన్న కాంగ్రెస్‌

ఆదివాసీలకు అండగా ఉద్యమాన్ని ఉదృతం చేసింది తెలంగాణ కాంగ్రెస్‌. ఇటీవల రాష్ట్రంలో ఆదివాసీలు, దళితులపై దాడులు పెరగడంతో వారికి మద్దతుగా నిలిచింది కాంగ్రెస్. అటవీ హక్కులను అమలు చేయడంతో పాటు, పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌తో ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేపట్టారు కాంగ్రెస్‌ నేతలు. తెలంగాణలో ఎన్నో ఏళ్ల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న ఆదివాసీల తరుపున పోరాటాన్ని దేశ వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడంతో పాటు, పోడు సాగుదారులకు వెంటనే పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌తో ఇందిరాపార్కు దగ్గర దీక్ష నిర్వహించారు కాంగ్రెస్‌ నేతలు.

ఆదివాసీల హక్కుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని దీక్షకు దిగిన బెల్లయ్య నాయక్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అటవీ భూమిని పోడుభూమిగా చేసి ప్రభుత్వం ఆక్రమించే ప్రయత్నం చేస్తోందని బెల్లయ్య నాయక్‌ మండిపడ్డారు. దీనికి నిరసనగా ఆగస్ట్‌ 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ఢిల్లీలోనూ దీక్ష చేపడతాన్నారు.

ఆదివాసీ ప్రాంతాల్లో దళితుల హక్కులు అమలు చేయడానికి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌. ఆదివాసీ చట్టాలపై సీరియస్‌గా ఉండాల్సిన ప్రభుత్వాలే.. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఆదివాసీలు హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు.

ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో అఖిల భారత ఆదివాసీ కాంగ్రెస్‌, తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధార్నాలో భారీగా ఆదివాసీలు పాల్గొన్నారు. తలపై బిందెలు పెట్టుకుని.. సంప్రదాయ నృత్యాలు చేస్తూ.. ఆదివాసీలు వినూత్న రీతిలో తమ నిరసన తెలిపారు.

Next Story

RELATED STORIES