రమేష్ కుమార్ సంచలనాలకు పెట్టింది పేరు

రమేష్ కుమార్ సంచలనాలకు పెట్టింది పేరు. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్నది సాధించే రకం. మొండితానానికి మారుపేరు. పట్టుదలకు బ్రాండ్ అంబాసిడర్. సీరియల్స్ టు స్పీకర్ చైర్ వరకు సాగిన ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిద్దాం.

కె. రామప్ప రమేశ్ కుమార్‌ 1949 నవంబరు 22న కోలార్‌ జిల్లాలోని శ్రీనివాసపూర్‌లో జన్మించారు. 1970ల్లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రమేశ్.. యూత్‌ కాంగ్రెస్‌ సభ్యుడిగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. షార్ట్ పీరియడ్ లోనే యంగ్ లీడర్ గా ఎదిగారు. ఆయన దూకుడు చూసి 1978లో అప్పటి ముఖ్యమంత్రి దేవరాజ ఉర్స్‌ రమేశ్‌కు టికెట్‌ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో శ్రీనివాసపూర్‌ నియోజకవర్గం నుంచి గెలిచి 29ఏళ్ల వయసులోనే తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1985లో రమేశ్‌ జనతాదళ్‌ పార్టీ నుంచి శాసనసభకు పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కొన్ని కారణాలవల్ల 2004లో తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరిన రమేశ్‌ అప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు.

శ్రీనివాసపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఆరు సార్లు శాసనసభకు ఎంపికైన రమేశ్ కుమార్‌ను తన నియోజకవర్గ ప్రజలు "స్వాములు" అని అభిమానంగా పిలుచుకుంటారు. 1994-99 మధ్య రమేశ్‌ తొలిసారిగా స్పీకర్‌ బాధ్యతలు చేపట్టారు. 2018లో ఏర్పడిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో మరోసారి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు తాజా సంక్షోభంతో రమేశ్ కుమార్‌ పేరు మార్మోగిపోతోంది. అయితే వివాదాలు ఆయనకు కొత్తేం కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆడియో టేపుల అంశం కర్ణాటకలో సంచలనం సృష్టించింది.‘ఆపరేషన్‌ కమలం’కు సంబంధించిన ఆడియో టేపులను ముఖ్యమంత్రి కుమారస్వామి అసెంబ్లీలో విడుదల చేశారు. వీటి గురించి మీడియా రమేశ్ కుమార్‌ను పశ్నించగా.. తన పరిస్థితి అత్యాచార బాధితురాలికంటే దారుణంగా ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పార్టీ ఒత్తిడితో క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

కాంగ్రెస్‌ ఎంపీ మునియప్పతోనూ రమేశ్‌ కుమార్‌కు అంతర్గత విభేదాలున్నాయి. మునియప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న కోలార్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోనే శ్రీనివాసపూర్‌ కూడా ఉంది. వీరి మధ్య చాలా కాలంగా గొడవలున్నాయి. దీనిపై మునియప్ప బదులిస్తూ.. రమేశ్‌కు నాకు ఎలాంటి విభేదాలు లేవు. మేమిద్దరం భార్యాభర్తల్లాంటి వాళ్లం అని అన్నారు. ఈ వ్యాఖ్యలకు రమేశ్‌..నేను మగాళ్లతో పడుకోను. నాకు ఓ భార్య ఉంది అని ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపైనా అప్పట్లో దుమారం రేగింది.

వివాదాలే కాదు.. రమేష్ కుమార్ లో కామెడీ యాంగిల్ కూడా ఉంది. అసెంబ్లీ హాట్ హాట్ గా జరుగుతున్న సమయంలో ఆయన తనదైన శైలిలో జోకులు పేలుస్తూ నవ్వులు పూయించేవారు. రెబల్ ఎమ్మెల్యేలను చంబల్ బందిపోట్లుగా జేడీఎస్ ఎమ్మెల్యే కేఎం శివలింగ గౌడ అభివర్ణించినప్పుడు, స్పీకర్ జోక్యం చేసుకుంటూ, మన ఎమ్మెల్యేలతో పోల్చి బందిపోట్లను ఎందుకు చిన్నబుచ్చుతారు?' అంటూ పేల్చిన బాంబుకు సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి.

పాలిటిక్స్ లోనే కాదు... నటుడిగానూ రమేశ్‌ కుమార్‌ కు ప్రజల్లో మాంచి పేరుంది. 1994లో స్పీకర్‌గా నియమితులైన రమేశ్‌.. ఆ తర్వాత 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దీంతో రాజకీయాలకు కొంత విరామమిచ్చి.. సినీ రంగ ప్రవేశం చేశారు. తొలుత సీరియళ్లలో నటించిన ఆయన.. కొన్ని సినిమాల్లోనూ కన్పించారు. ప్రముఖ ఫిల్మ్‌మేకర్‌ టీఎన్ సీతారామ్‌ దర్శకత్వం వహించిన ‘ముక్త’ అనే సూపర్‌హిట్‌ సీరియల్‌లో న్యాయమూర్తిగా నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు రమేష్ కుమార్.

1994లో స్పీకర్‌గా పనిచేసిన అనుభవంతో రమేష్ కుమార్ సభా వ్యవహారాల నిర్వహణలో మంచి పట్టు సాధించారు. చట్టం, రాజ్యాంగ అంశాల్లోనూ పూర్తి అవగాహన ఉంది. అందుకే ఇప్పటి కన్నడ సంక్షోభ సమయంలో అన్ని రూల్స్ ని అత్యంత చాకచక్యంగా వినియోగించుకుంటూ... రూల్స్ రామానుజం అనిపించుకుంటున్నారు... స్పీకర్ రమేష్ కుమార్.

Tags

Read MoreRead Less
Next Story