తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు

తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు నెలలుగా సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడ్డ రైతులకు.. ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్‌, కాటారం, మహముత్తారం, మలహర్‌, పలిమేల మండలాల్లో గత రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. ఇన్ని రోజులు బోసిపోయిన చెరువులు, కుంటలు, బోరుబావులు తాజగా కురుస్తన్న వర్షంతో కళకలలాడుతున్నాయి.

భారీ వర్షాలు అటు బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి సింగరేణి జీకేఓసీలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లు చిత్తడి చిత్తడిగా మారిపోవడంతో ఎక్కడి యంత్రాలు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు.

జయశంకర్‌ జిల్లా భూపాల్లిలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. సింగరేణి ఓపెన్ కాస్ట్‌-1, 2లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. అటు తూర్పుగోదావరి జిల్లాలోనూ ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వరి చేలు నీట మునిగాయి. వర్షాలకు తోడు భారీగా ఊదురు గాలులు వీయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమలపురంలోని రోడ్లన్ని నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. నెల్లూరు జిల్లాలోను కుండపోత వర్షం కురిసింది. చాలా రోజుల తర్వాత వర్షం కురవడంతో నగరం తడిసి ముద్దైంది. అటు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీవర్షాలకు వాగులు ,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి

ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరాన్ని మొత్తం మేఘాలు కమ్మేశాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, లక్డికాపూల్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు.. వాయువ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ బెంగాల్‌ తీరానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. రాబోయే రెండు రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని... మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని.. వాతావరణ శాఖ హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story