ఫోన్ బుక్ చేస్తే.. సబ్బులు పంపిస్తారా.. ఉండండి మీ పని చెప్తా..

ఫోన్ బుక్ చేస్తే.. సబ్బులు పంపిస్తారా.. ఉండండి మీ పని చెప్తా..

ఆన్‌లైన్లో ఆర్డర్ చేస్తే కోరుకున్న వస్తువు గుమ్మంలోకి వస్తుంది. బోల్డంత టైము కలిసి వస్తుంది. అన్నిటికీ ఆన్‌లైన్.. ఫుడ్డు కావాలంటే ఆన్‌లైన్.. బెడ్డు కావాలంటే ఆన్‌లైన్. మరి ఒకటి బుక్ చేస్తే మరొకటి వస్తే.. చిర్రెత్తదు. డెలివరీ బాయ్‌ని నాలుగు తిట్టి పంపిస్తే ఏమొస్తుంది. కంపెనీ మీద కంప్లైంట్ ఇస్తే దారికొస్తారు. నాలా మరొకరికి జరక్కూడదంటే బాధ్యతగా వ్యవహరించాల్సిన బాధ్యతను వారికి గుర్తు చేయాలి. అందుకే పంజాబ్ మొహాలీకి చెందిన 26 ఏళ్ల సివిల్ ఇంజనీర్ పర్వీన్ కుమార్ శర్మ.. ఆన్‌లైన్లో ఐఫోన్ ఆర్డర్ చేస్తే 5 బట్టలు ఉతికే సబ్బులు పంపించారు.

యాపిల్ ఐఫోన్ 7 ప్లస్ కోసం శర్మ మార్చి 4, 2017న స్నాప్ డీల్‌లో ఆర్డర్ చేశారు. మార్చి 12లోపు మీ ఆర్డర్ డెలివరీ చేస్తామని మెసేజ్ వచ్చింది. పియోస్ ఫ్యాషన్ సంస్థ ఆ ఫోన్‌ను అమ్మింది. మార్చి 6న బ్లూడార్ట్‌కి చెందిన డెలివరీ బాయ్ పార్సిల్ తెచ్చి ఇచ్చాడు. దాన్ని తెరిచి చూసిన శర్మకి ఐఫోన్ బదులు 5 డిటర్జెంట్ సబ్బులు వచ్చాయి. వెంటనే శర్మ స్నాప్‌డీల్‌ హెల్ప్‌లైన్‌కి కాల్ చేసి కంపెనీ ప్రతినిధులకు విషయం చెప్పారు. మార్చి 13న కొరియర్ సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులు.. డెలివరి చేసిన ప్యాకెట్‌ను తిరిగి తీసుకుని దర్యాప్తు జరిపించారు. దీంట్లో కొరియర్ బాయ్ తప్పేమీ లేదని డెలివరీ సమయంలో పార్సిల్ ప్యాక్ చేసే ఉందని తేల్చారు.

అయితే స్నాప్‌డీల్ మాత్రం తాము ఐఫోన్ పంపినా.. కస్టమర్ అబద్దం చెబుతున్నారని వాదించింది. అసలు ఈ డెలివరీతో తమకు సంబంధం లేదనీ తాము వస్తువు అమ్మేవారికి, కొనేవారికీ మధ్యవర్తుల్లా మాత్రమే వ్యవహరిస్తామని తెలిపింది. పైగా ఆయన అకౌంట్‌ని కూడా డిలీట్ చేసింది. దీంతో శర్మ జూన్ 19, 2017న మొహాలీ కన్స్యూమర్ ఫోరంకి ఫిర్యాదు చేశారు. స్నాప్‌డీల్ ద్వారానే కొరియర్ సర్వీస్ జరిగినందున స్నాప్ డీల్‌కి ఈ ఇష్యూతో సంబంధం ఉందని ఫోరం తేల్చింది. పార్సిల్‌పై మొబైల్ IMEI నెంబర్ ఎందుకు వెయ్యలేదని ఫోరం ప్రశ్నించింది. రూల్స్ అతిక్రమించినందుకు స్నాప్ డీల్, పియోస్ ఫ్యాషన్, బ్లూడార్ట్ కలిసి.. రూ.81,799 రిఫండ్‌ను మార్చి4, 2017 నుంచి 8 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. అలాగే పరిహారంగా రూ.10 వేలు, కోర్టు ఖర్చులకు రూ.10 వేలు.. మొత్తం కలిపి లక్షరూపాయలు శర్మకు చెల్లించాలని ఆర్డర్ పాస్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story