సుష్మాస్వరాజ్ చనిపోవడానికి మూడు గంటల ముందు..

సుష్మాస్వరాజ్ చనిపోవడానికి మూడు గంటల ముందు..

ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్న భారత రాజకీయ నేతల్లో సుష్మాస్వరాజ్ ఒకరు. ఆమెకు ట్విట్టర్‌లో కోటి 30లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. మంత్రిగా విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది భారతీయులకు ఆమె ట్విట్టర్ ద్వారా సాయం చేశారు. విదేశాంగ మంత్రిగా ఆమె చేసిన ట్వీట్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. ఆమె ఓ ప్రతిభావంతురాలైన నాయకురాలనీ, అద్భుతమైన పాలనా చాతుర్యం ఆమెది అని మెచ్చుకున్నారు. చనిపోవడానికి మూడు గంటల ముందు కూడా ఆమె ట్వీట్ చేశారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం, ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని చివరి ట్వీట్‌లో ఆమె మెచ్చుకున్నారు. ఈ ట్వీట్‌ను లక్షా 76వేల మంది లైక్ చెయ్యగా... 43వేల మంది రీట్వీట్ చేశారు.

సుష్మా స్వరాజ్ ట్విట్టర్ అకౌంట్ లో ఉన్న ట్వీట్లలో అత్యధికంగా లైకులు, కామెంట్లు వచ్చినవి ఉన్నాయి. ఇందులో సరదాగా ఉంటాయి.. చురకలు ఉంటాయి. అందుకే అమెను ఫాలో అయ్యేవారు తప్పకుండా ట్వీట్లు చూడకుండా ఉండరు. ఈ ఏడాది మార్చిలో.. మలేసియాలో ఉన్న ఓ భారతీయుడు.. తన ఫ్రెండ్‌ని ఇండియా నుంచీ తిరిగి మలేసియా రప్పించాల్సిందిగా కోరుతూ సుష్మాస్వరాజ్‌కి ట్వీట్ చేశాడు. ఐతే.. ఇంగ్లీష్‌లో ఉన్న ఆ ట్వీట్‌లో గ్రామర్ తప్పులు ఉన్నాయి. అది చూసిన మరో ట్వీటర్... హిందీలోగానీ, పంజాబీలో గానీ ట్వీట్ పంపమని సూచించాడు. వెంటనే రిప్లై ఇచ్చిన సుష్మాస్వరాజ్... మరేం పర్లేదనీ, తాను విదేశాంగ మంత్రి అయ్యాక... అన్ని యాక్సెంట్స్, గ్రామర్‌లో ఇంగ్లీష్ ఫాలో అవుతున్నానంటూ సరదాగా కామెంట్ పెట్టారు.

ట్విట్టర్‌లో సుష్మస్వరాజ్ తన పేరు ముందు చౌకీదార్ అని ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని మార్చిలో ఓ నెటిజన్ కోరగా... తాను భారతీయుల రక్షణ కోసం కాపలాదారుగా ఉన్నాననీ, విదేశాల్లోని భారతీయుల కోసం పనిచేస్తున్నానంటూ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. జర్మనీలో భారతీయ జంటను కత్తితో పొడిచిన సందర్భంలో ఓ యూజర్.. ఈ ట్వీట్లు సుష్మస్వరాజ్ చెయ్యట్లేదనీ, ఆమెకు సంబంధించిన PR వ్యక్తి చేస్తూ ఉండొచ్చని ట్వీట్ చేశాడు. దానికి రిప్లై ఇచ్చిన సుష్మస్వరాజ్... ట్వీట్ చేస్తున్నది తానేననీ, దెయ్యం కాదనీ సమాధానం ఇచ్చి చురకలేశారు. ఇక చలాకీగా సమాధానాలు ఇవ్వడంలోనూ సుష్మాకు తిరుగులేదు. ఆమెను ఇబ్బంది పెట్టేందుకు ఓ నెటిజన్.. మార్స్‌పై చిక్కుకుపోతే మీరు కాపాడేందుకు సాయపడతారా అని ప్రశ్నించాడు. మీరు మార్స్‌లో చిక్కుకున్నా సరే.. అక్కడి భారత రాయబార కార్యాలయం మీకు సాయం చేస్తుంది అని ట్వీట్ చేశారు. పాడైన రిఫ్రిజిరేటర్‌ను సరిచేసే విషయంలో మీరు సాయం చేస్తారా అనే తిక్క ప్రశ్న వేశాడో నెటిజన్. దానికి సుష్మస్వరాజ్.. బ్రదర్.. ఈ విషయంలో నేను సాయం చెయ్యలేను. నేను కష్టంలో ఉన్న మనుషుల కోసం సాయం చేయడంలో బిజీగా ఉన్నానంటూ కుండబద్దలు కొట్టారు.

Tags

Read MoreRead Less
Next Story