వైద్యుడి కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్తకోణం

అమలాపురంలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య కేసు కొత్త అనుమానాలకు తావిస్తోంది. గత నెలలో విషాన్ని సెలైన్‌తో ఎక్కించుకొని డాక్టర్ రామకృష్ణంరాజు అతని భార్య, కుమారుడుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆర్ధోపెడిక్ డాక్టర్ గా రామకృష్ణం రాజుకు మంచి పేరు ఉంది. తక్కువలో వైద్యం చేసే వ్యక్తిగా మంచి గుర్తింపు కూడా ఉంది. కుటుంబంలో అంతా డాక్టర్లే. పెద్దకుమారుడు MBBS పూర్తి చేశాడు. చిన్న కుమారుడు మెడిసిన్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. దీంతో కుమారులను ఇద్దర్ని డాక్టర్‌ చేయాలన్న అతని కోరిక కూడా నేరవేరింది. అయితే..ఆత్మహత్యకు ముందు రామకృష్ణంరాజు పెద్ద కుమారుడు సూసైడ్ నోట్ రాసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సూసైడ్ లెటర్ లో ఏం ఉంది? ఎవరెవరి పేర్లు ఉన్నాయి? ఇలాంటి అనుమానాలు ఎన్నో తెరపైకి వస్తున్నాయి. వారి ఆత్మహత్యకు రైస్‌పుల్లింగే ప్రధాన కారణమంటూ ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేసిన పోలీసులు.. సూసైడ్ లెటర్ ను మాత్రం గుట్టుగా పెట్టడం వెనుక సందేహాలు కలుగుతున్నాయి.

రామకృష్ణం రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విపరీతంగా నష్టపోయాడు. దీంతో అందినకాడికి అప్పులు చేశాడు. 10 రూపాయల వడ్డీ లెక్కన ఫైనాన్స్ తీసుకున్నాడు. అప్పుల్లో కూరుకుపోయిన ఒత్తిడిలో ఉన్న డాక్టర్ ని రైస్ పుల్లింగ్ గ్యాంగ్ బుట్టలో వేసుకుంది. తమవద్ద మహిమగల వస్తువులు ఉన్నాయని.. వాటిని ఇంట్లో పెట్టుకుంటే అపారమైన సంపద వస్తుందని డాక్టర్‌ను నమ్మించారు. రైస్ పుల్లింగ్ వస్తువులను సేకరించేందుకు అధికవడ్డీలకు అప్పు తెచ్చి ఐదు కోట్లు ముఠా సభ్యులకు ఇచ్చాడు. అప్పటికే డాక్టర్ అప్పుల చిట్టా 10 కోట్లు దాటిపోయింది. మరోవైపు రైస్ పుల్లింగ్ అంతా మోసమని తెల్సుకున్న డాక్టర్ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

Next Story

RELATED STORIES