ఆ మహిళలకు వెంటనే పరిహారం అందించండి

ఆ  మహిళలకు వెంటనే పరిహారం అందించండి

మహిళా శిశు సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిపెట్టారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాల అమల్లో అనుసరిస్తున్న విధానాలు పథకాలను నిరాకరించేలా ఉండకూడదన్నారు. బయోమెట్రిక్‌, ఐరిస్‌, వీడియో స్క్రీనింగ్‌ వంటివన్నీ ఆ పథకం లబ్ధిదారుడికి చేరేందుకు ఉపయోగపడాలన్నారు. అటు గ్రామాల నుంచి వస్తున్న అత్యవసర విషయాలపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించేందుకు ప్రత్యేక మెకానిజం ఉండాలని అధికారులకు సూచించారు. ఇందు కోసం ప్రతి గ్రామ సచివాలయంలో హెల్ప్‌లైన్‌ ఉండాలన్నారు.

వేధింపులకు గురైన మహిళలకు ఇవ్వాల్సిన పరిహారం అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన 7.48 కోట్ల రూపాయల పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. అలాగే వివిధ ఘటనల్లో బాధితులకు న్యాయం చేయడానికి జిల్లా కలెక్టర్‌కు కోటి రూపాయల చొప్పున నిధిని కేటాయించాలని సీఎం అన్నారు. మరోవైపు గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపైనా సీఎం జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాలు, ఇతర సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలన్నారు.. దశాబ్దాల తరబడి నాన్చి న్యాయం జరగని పరిస్థితి ఉండకూడదన్నారు. అంగన్‌ వాడీ సెంటర్ల స్థితిగతులపై పూర్తి నివేదిక సిద్ధంచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. స్కూళ్లలో నాడు – నేడు తరహా కార్యక్రమాలను చేపట్టడానికి ప్రణాళిక తయారు చేయాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story