కశ్మీర్‌పై రాద్దాంతం చేస్తున్న చైనాకు గట్టి షాక్!

కశ్మీర్‌పై రాద్దాంతం చేస్తున్న చైనాకు గట్టి షాక్!

కశ్మీర్‌పై రాద్దాంతం చేస్తున్న చైనాకు గట్టి షాక్ తగిలింది. కశ్మీర్‌తో కలవరం పుట్టించాలని చైనా వేసిన ఎత్తుగడను భారత ప్రభుత్వం తిప్పికొట్టింది. చైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడర్‌కు మోదీ సర్కారు ఎసరుపెట్టింది. అసలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మీకు పనేంటని చైనాను గట్టిగా నిలదీసింది. పీఓకేలో నిర్మాణాలు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించింది. రోడ్డు మార్గాలు ఎందుకు వేస్తున్నారని మండిపడింది. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడర్‌ను అంగీకరించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. పీఓకే తమదే అని, ఇందులో రెండో అభిప్రాయానికి అవకాశమే లేదని తేల్చి చెప్పింది. జమ్మూకశ్మీర్ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది.

చైనా విదేశాంగమంత్రి వాంగ్‌యు ఇటీవల పాకిస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కశ్మీర్ అంశాన్ని చైనా, పాక్ నాయకులు ప్రస్తావించారు. కశ్మీర్‌పై భారత ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆర్టికల్-370 రద్దుతో తమ సార్వభౌమత్వాన్ని భారత్ దెబ్బతీస్తోందని వితండవాదన చేశారు. నిజానికి జమ్మూకశ్మీర్ మొత్తం భారతదేశానికి చెందుతుంది. దేశ విభజన అనంతరం పాకిస్థాన్, చైనాలు దురాక్రమణ జరిపి కశ్మీర్‌లోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. అవే పీఓకే, అక్సాయ్ చిన్‌లు. ఈ రెండు ప్రాంతాలు తమవి కావనే విషయం పాక్, చైనాలకు స్పష్టంగా తెలుసు. ఐనప్పటికీ దొంగే.. దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. పైగా, పీఓకే, అక్సాయ్ చిన్‌లు తమ జాగీర్లు అనుకుంటూ ఎడాపెడా నిర్మాణాలు చేపడుతున్నాయి. ఆ క్రమంలోనే చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడర్ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టు పీఓకే ద్వారానే వెళ్తుంది. సరిగ్గా ఈ పాయింట్‌నే భారత ప్రభుత్వం పట్టుకుంది. తమ భూభాగంలో మీ నిర్మాణాలేంటని సూటిగా ప్రశ్నించింది.

కశ్మీర్‌ను అడ్డుగా చేసుకొని మనదేశాన్ని సతాయించాలనుకున్న డ్రాగన్‌కు సీపెక్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సీపెక్ విషయంలో చైనా ప్రభుత్వం కిందామీదా పడుతోంది. అసలు ఆ ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా అని టెన్షన్ పడుతోంది. ఇప్పుడు భారత ప్రభుత్వం పీఓకే, అక్సాయ్‌ చిన్‌లు తమవే అని తేల్చి చెప్పడంతో చైనా పాలకుల గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లైంది. ఎరక్కపోయి ఇరుక్కున్నామా అని చైనా పాలకులు మధనపడుతున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story