దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. మోదీతో భేటీ కానున్న దీదీ

దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. మోదీతో భేటీ కానున్న దీదీ

దేశ రాజకీయాల్లో బుధవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. ఉప్పు-నిప్పులా చిటపటలాడుతున్న ఇద్దరు అగ్రనాయకులు బుధవారం భేటీ కానున్నారు. అందులో ఒకరు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాగా, మరొకరు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మోదీ అంటేనే ఇంతెత్తున ఎగిరిపడే మమతా బెనర్జీ, బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఐతే, ఇది మర్యాదపూర్వక భేటీ అని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధుల విడుదలతో పాటు రాష్ట్రం పేరు మార్పుపై ప్రధానితో చర్చిస్తానని ఆమె చెప్పారు.

మోదీతో మీటింగ్‌పై లో ప్రొఫైల్‌ మెయింటైన్ చేయడానికి దీదీ ప్రయత్నిస్తున్నప్పటికీ రచ్చ మాత్రం రాజుకుంది. మమతా బెనర్జీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. మోదీపై దీదీ చేసిన వ్యాఖ్యలు, ఆమె వ్యవహరించిన తీరే అందుకు కారణం. దాదాపు రెండేళ్లుగా మోదీపై దీదీ తీవ్ర విమర్శలు చేశారు. విపక్షాలతో జట్టు కట్టి మోదీని గద్దె దింపుతామని ప్రతిజ్ఞ చేశారు. తుపాను పై సమీక్షకు కూడా హాజరు కాలేదు. నీతి ఆయోగ్ మీటింగ్‌‌కు డుమ్మా కొట్టారు. అస్సలు మోదీ పేరెత్తితేనే భగ్గున మండిపోయేవారు. అలాంటిది ఒక్కసారిగా ఆమె యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. పుట్టినరోజు సందర్భంగా మోదీకి శుభాకాంక్షలు తెలిపిన దీదీ, బుధవారం మోదీతో మీటింగ్‌కు సిద్ధమయ్యారు.

శారదా స్కామ్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ పీకల్లోతుల్లో కూరుకుపోయింది. టీఎంసీకి చెందిన చోటా మోటా నాయకులు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీబీఐ టార్గెట్ చేసింది. ఆయన్ను అరెస్టు చేసి ప్రశ్నిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సీబీఐ చెబుతోంది. ఈ నేపథ్యంలో మోదీ-మమత మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story