కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు..

కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు..
X

కర్ణాటకలో మళ్లీ ఎలక్షన్లు వచ్చాయి. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుతో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 15 స్థానాలకు బై ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 21న ఎన్నికలు జరుగనుండగా, 24న ఫలితాలు వెల్లడవుతాయి. గోకక్, అథాని, రానెబెన్నూరు, కగ్వాడ్, హైరెకెరూర్, ఎల్లాపూర్, యశ్వంత్‌పుర, విజయనగర, శివాజీనగర్, హోసకోతె, హున్సూర్, కృష్ణరాజ్‌పేట్, మహాలక్ష్మి లేఔట్, కేఆర్ పుర, చిక్‌బల్లాపుర నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన స్థానాలే.

ఇటీవల కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారుపై తిరుగుబాటు జరిగింది. ఆ 2 పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఐతే, నాటి స్పీకర్ రమేష్ కుమార్, రాజీనామాలను ఆమోదించకుండా వారిపై అన ర్హత వేటు వేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ ప్రజాప్రతినిధులు సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ఊరట లభించలేదు. స్పీకర్ ఆదేశాలపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. దాంతో ఆయా స్థానాలు ఖాళీగా మారడంతో ఎన్నికల సంఘం బై ఎలక్షన్స్‌ నిర్వహించాలని నిర్ణయించింది.

ఇప్పుడు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 2024 వరకు ఎన్నికల్లో పాల్గొనకుండా నాటి స్పీకర్ అనర్హత వేటు వేశారు. దాంతో ఉప ఎన్ని కల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. తమకు దక్కకపోయినా తమ కుటుంబంలో వారికైనా అవకాశమివ్వాలని అనర్హత ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మరి ఈ విజ్ఞప్తిని కమలదళం మన్నిస్తుందో లేదో చూడాలి. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారు కూలిపోయి యడియూరప్ప ప్రభుత్వం మళ్లీ గద్దెనెక్కడంతో 15 మంది ఎమ్మెల్యేలే కీలకంగా వ్యవహరించారు. దాంతో, వారికి ఏదో విధంగా ప్రయోజనం చేకూర్చాలనే వాదన వినిపిస్తోంది.

అటు కర్నాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏ ఒక్కరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని జేడీఎస్‌ తెగేసి చెప్పింది. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది.. కుమారస్వామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ట్విట్టర్‌లో జేడీఎస్‌ పేర్కొంది. దీంతో ఉప ఎన్నికల పోరు బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ల మధ్య రసవత్తరంగా జరగనుంది.

Also watch :

Next Story

RELATED STORIES