భారతీయులపై ప్రశంసల వర్షం కురిపించిన ట్రంప్..

భారతీయులపై ప్రశంసల వర్షం కురిపించిన ట్రంప్..

హ్యూస్టన్ హోరెత్తిపోయింది.. మోదీ నామస్మరణతో మార్మోగిపోయింది.. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించిన హౌడీ-మోదీ మీటింగ్‌కు ప్రజలు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన ప్రవాస భారతీయులతో NRG ఫుట్‌బాల్‌ స్టేడియం జనసంద్రంగా కనిపించింది. NRIలు, మోదీ అభిమానులు త్రివర్ణ పతాకాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు. 50 వేలకు పైగా తరలివచ్చిన జన సందోహాన్ని మరింత ఉత్తేజితులను చేస్తూ అమెరికన్‌ సెనెటర్లు ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు అతి దగ్గరి స్నేహితులైనందుకు అమెరికా గర్విస్తోందన్నారు. మోదీకి యావత్‌ అమెరికా ప్రజలందరి తరపున హార్థిక స్వాగతం తెలుపుతున్నామంటూ... మోదీని సభా స్థలి పైకి ఆహ్వానించారు.

వేలాది సభికుల కరతాళ ధ్వనులు.. మోదీ, మోదీ నినాదాల మధ్య సభా వేదికపైకి వచ్చారు ప్రధాని నరేంద్రమోదీ. అందరికీ అభివాదం చేస్తూ టెక్సాస్‌ సెనెటర్లను ఆప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కలిసి వేదిక మీదకు వచ్చారు నరేంద్ర మోదీ. ఇద్దరూ కలిసి ప్రజలకు అభివాదం చేశారు. మొదట ట్రంప్‌ను భారతీయ కమ్యూనిటీకి పరిచయం చేశారు మోదీ.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భారత్, అమెరికా మధ్య ఉన్న సత్సంబంధాలను ప్రస్తావించిన మోదీ.. డొనాల్డ్ ట్రంప్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. 2017లో నన్ను మీ కుటుంబానికి పరిచయం చేశారని గుర్తు చేసిన మోదీ.. ఈ రోజు మిమ్మల్ని మా కుటుంబానికి పరిచయం చేస్తున్నానంటూ భారతీయులందరికీ ట్రంప్‌ను పరిచయం చేశారు. ట్రంప్‌ తనకు స్నేహితుడని.. భారత్‌కు ఆప్తమిత్రుడంటూ పరిచయ కార్యక్రమాన్ని ముగించారు మోదీ.

పరిచక కార్యక్రమం ముగిసిన వెంటనే ట్రంప్ వద్దకు వెళ్లి మోదీ కరచాలనం చేశారు. ఆ తర్వాత ముందు వరుసలో కూర్చొని ట్రంప్‌ ప్రసంగాన్ని విన్నారు మోదీ. ఇదో చరిత్రాత్మక ఘట్టమంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టిన ట్రంప్‌.. భారతీయులపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీని కూడా పొగడ్తలతో ముంచెత్తారు. భారత్‌ అభివృద్ధి కోసం మోదీ ఎంతో చేస్తున్నారన్నారు. ఇదే వేదిక నుంచి సరికొత్తగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి మోదీని ఆశ్చర్యానికి గురిచేశారు ట్రంప్‌. మళ్లీ అధికారంలోకి వచ్చినందుకు అభినందనలు తెలుపుతూనే మోదీ మరో మైలు రాయిని అందుకున్నారంటూ పుట్టినరోజు అంశాన్ని ప్రస్తావించారు. ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

ట్రంప్‌ ప్రసంగం పూర్తయిన తర్వాత మోదీ సభను ఉద్దేశించి మాట్లాడారు.. ప్రస్తుత అంశాలు, అభివృద్ధి విధానాలు, భవిష్యత్తు వ్యూహాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.. తొమ్మిది భారతీయ భాషల్లో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. హౌడీ మోదీ అనే మాటకు సమాధానంగా అంతా బాగుంది అనే పదాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, ఒడియా భాషల్లో పలికారు. దీంతో ప్రజలంతా చప్పట్లతో మోదీ నినాదాలతో హోరెత్తించారు.

మరోవైపు మోదీ ప్రసంగాన్ని ఆసాంతం ఆసక్తిగా వింటూ ఉండిపోయారు ట్రంప్‌.. ప్రసంగం ముగిసిన తర్వాత ఇద్దరూ కలిసి స్టేడియంలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.. ఈ సందర్భంగా అమెరికాతో భారత్‌ మైత్రిని కళ్లకు కట్టేలా చూపించారు మోదీ.

Tags

Read MoreRead Less
Next Story