పిల్లల భవిష్యత్తుకు ఎల్‌ఐసీ భరోసా.. అత్యవసర పరిస్థితుల్లో బీమా సంస్థే..

పిల్లల భవిష్యత్తుకు ఎల్‌ఐసీ భరోసా.. అత్యవసర పరిస్థితుల్లో బీమా సంస్థే..
X

పిల్లల కోసం పెద్దవాళ్లుగా మనం చేయాల్సినవన్నీ చేయాలి. ముఖ్యంగా వారి మంచి చదువులు చెప్పించడం కోసం ఆర్థికంగా అండగా ఉన్న మంచి పాలసీలను ఎంచుకోవాలి. పిల్లలకు సంబంధించిన పాలసీలు తీసుకున్నప్పుడు వారి పేరుతో పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. పాలసీ నిబంధనల ప్రకారం బీమా సంస్థే సొంతంగా ప్రీమియంని చెల్లించుకుంటుంది. వారి చదువులకు, వారి వివాహానికి, సొంతంగా ఏదైనా సంస్థను ప్రారంభించడంలాంటి సందర్భాల్లో అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు బీమా పాలసీలు ఉపయోగపడతాయి.

పిల్లల చిన్నప్పుడే పాలసీలు తీసుకుంటే వారి కోసం కొంత సొమ్ము భధ్రపరచడం అలవాటవుతుంది. ఆర్థిక క్రమశిక్షణ అవర్చుకున్నవారవుతారు. వారి భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ పాలసీ మొత్తాన్ని ఇతర అవసరాలకు వాడకూడదు అనే స్వీయ నియంత్రణా వస్తుంది. ఇందుకోసం సంప్రదాయ పాలసీలతో పాటు, యూనిట్ ఆధారిత పిల్లల బీమా పథకాలూ అందుబాటులో ఉన్నాయి. పిల్లల భవిష్యత్ అవసరాలకు ఎంత మొత్తం అవసరం అవుతుంది అనేదాన్ని అంచనా వేసుకుని బీమా సంస్థను సంప్రదించి ఏ పాలసీని ఎంత మొత్తానికి తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. దానికోసం నెలకు ఎంత ప్రీమియం కట్టాల్సి వస్తుంది అనేది తెలుసుకోవాలి.

ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్నప్పుడు.. బీమా సంస్థకు వచ్చే లాభాలు, మిగులు ఆధారంగా బోనస్ లభిస్తుంది. ఈ పాలసీలు సమీకరించిన డబ్బును డెట్ పథకాల్లో మదుపు చేస్తాయి. కాబట్టి వార్షిక సగటు రాబడి 6 శాతానికి అటూ ఇటుగా ఉండే వీలుంటుంది. కొంత మంది సలహాలు ఇస్తుంటారు మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయమని.. ఏ పెట్టుబడి పథకమూ.. పిల్లలకు ఒక వయసు వచ్చిన తరువాత ఏ పరిస్థితుల్లోనైనా కచ్చితంగా ఇంత మొత్తం ఇస్తామని హామీ ఇవ్వదు. మదుపు చేసినప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

పిల్లల కోసం తీసుకునే బీమా పాలసీల్లో ఉన్న ప్రత్యేకత.. పాలసీ తీసుకున్న వ్యక్తి అతడు లేక ఆమె మరణిస్తే పాలసీ రద్దవదు. పాలసీ వ్యవధి ముగిసే వరకు ప్రీమియం చెల్లింపులను బీమా సంస్థే భరిస్తుంది. ఇందులో 'వైవర్ ఆఫ్ ప్రీమియం' ఆప్షన్ ఉండడం వల్ల ప్రీమియం చెల్లింపులు రద్దవుతాయి. పాలసీదారుడు మరణించినప్పుడు భవిష్యత్తు ప్రీమియంలను బీమా సంస్థ భరించాలంటే.. ఇలాంటి పాలసీలే తీసుకోవాలి. బీమా సంస్థ పాలసీని కొనసాగించడం వలన బీమా మొత్తం క్రమం తప్పకుండా పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. పిల్లల నిజమైన అవసరాలకు డబ్బు అందుతుంది.

Next Story

RELATED STORIES