ఆర్టీసీ కార్మికులకు టీఎన్జీవో సంఘాల షాక్

ఆర్టీసీ కార్మికులకు షాకిచ్చారు టీఎన్జీవోలు. తామను సంప్రదించకుండానే సమ్మెకు వెళ్లారని ఆరోపించిన నేతలు.. అసలు ఆర్టీసీ కార్మికుల సమస్యలపై తమకు సరైన అవగాహన కూడా లేదన్నారు. పైగా పార్టీల ఉచ్చులో చిక్కుకోవద్దని సలహా కూడా ఇచ్చారు. అయితే.. ఆర్టీసీ జేఏసీ మాత్రం ముందు నుంచి టీఎన్జీవోలకు అన్ని విషయాలు చెబుతూనే ఉన్నామని అంటున్నారు.

ఆర్టీసీ సమ్మె రోజులు గడుస్తున్న కొద్ది మరింత ఉద్ధృతం అవుతోంది. కార్మికులతో చర్చల్లేవ్ అంటూ ప్రభుత్వం మొండిపట్టు వీడటం లేదు. ప్రభుత్వంలో విలీనం చేసే వరకు వెనక్కి తగ్గేది లేదంటూ కార్మికసంఘాలు కూడా తేల్చి చెప్పేస్తున్నాయి. పది రోజుల సమ్మెకు ప్రతిపక్ష పార్టీలతో సహా ఇతర ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తోంది. రెవెన్యు ఉద్యోగుల సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కూడా సంఘీభావంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలన్ని ఆర్టీసీకి బాసటగా నిలుస్తారనే ప్రచారం జరిగింది.

అయితే.. అనూహ్యంగా ఆర్టీసీ కార్మికులకు టీఎన్జీవో సంఘాల నుంచి భిన్నమైన స్పందన ఎదురైంది. సీఎంతో టీఎన్టీవో నేత రవీందర్ రెడ్డి భేటీ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఆర్టీసీ వర్సెస్ ఎన్జీవో నేతలు అన్నట్లుగా మారాయి. ఆర్టీసీ సమ్మెకు బలవంతంగా మద్దతు కూడగట్టే ప్రయత్నం జరుగుతుందని రవీందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎన్జీవో నేతలు ఆర్టీసీ సమ్మెపై తమ వైఖరిని స్పష్టం చేశారు. తమను సంప్రదించకుండానే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారన్నారు టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి. రాజకీయ పార్టీల ట్రాప్‌లో ఆర్టీసీ నేతలు పడొద్దంటూ సలహా ఇచ్చారు. సమస్యల సాధన కోసం సీఎంను కలిస్తే.. వక్రీకరిస్తున్నారంటూ మండిపడ్డారాయన. ఉద్యోగుల మధ్య రాజకీయ పార్టీలు చిచ్చుపెడుతున్నాయన్నారు.

తెలంగాణ ఉద్యమం తర్వాత ఆర్టీసీ కార్మిక నేతలు.. ఎప్పుడూ తమతో సమావేశం కాలేదన్నారు టీఎన్జీవో నేత మమత. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై తమకు సరైన అవగాహన కూడా లేదన్నారు. టీఎన్జీవో నేతల తీరుపై ఆర్టీసీ జేఏసీ విస్మయం వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై, సమ్మెదారి తీసిన పరిణామాలపై ముందు నుంచి టీఎన్జీవో నేతలకు అన్ని చెబుతూనే ఉన్నామని అంటోంది ఆర్టీసీ జేఏసీ.

Tags

Read MoreRead Less
Next Story