ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం

ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం

kcr

సమ్మెతో ప్రయాణికుల ఇక్కట్లు, బకాయి సొమ్ములపై హైకోర్టులో అసంతృప్తి నేపథ్యంలో ఆర్టీసీపై శుక్రవారం సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశంలో హైకోర్టు విచారణ, ప్రయాణికుల కోసం తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలపై అధికారులను ఆరా తీశారు. పదే పదే రివ్యూలు నిర్వహిస్తూ ఆర్టీసీ బకాయిలపై అవగాహన కల్పించినా హైకోర్టులో సమర్ధవంతంగా వాదనలు వినిపించలేకపోవటంపై కేసీఆర్ తప్పుబట్టారు. అధికారుల తీరుపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. హైకోర్టు ముందు ప్రభుత్వ వాదనలు వినిపించటంలో సరైన వాదనలు వినిపించలేదని సీఎం అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కేసీఆర్ ఆరా తీశారు. షెడ్యూల్ ప్రకారం అన్ని రూట్లలో బస్సులు నడిపించాలని గతంలోనే సీఎం సూచించారు. అయితే..బస్సుల కొరత వెంటాడుతుండటంతో ప్రజలకు తిప్పలు తప్పటం లేదు. దీంతో అద్దె బస్సుల నోటిఫికేషన్ పై అధికారులను ప్రశ్నించిన సీఎం..ఇన్నాళ్లైనా ఎందుకు ఆలస్యం అవుతోందని అన్నారు.

శనివారం కేబినెట్ మీటింగ్ ఉండటంతో ఆర్టీసీపై శుక్రవారం సమీక్షా సమావేశం ప్రధాన్యతను సంతరించుకుంది. కేబినెట్ మీటింగ్ లోనూ ఆర్టీసీ అంశంపైనే ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. కేబినెట్ ముందుకు వచ్చే అంశాలపై శుక్రవారం రివ్యూలో అధికారులతో చర్చించిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీపై శనివారం కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్సుంది. ఆర్టీసీకి శాశ్వత పరిష్కారం చూపించే దిశగానే కేబినెట్ నిర్ణయాలు ఉండబోతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story