తస్మాత్ జాగ్రత్త.. ఎక్కడ పడితే అక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టారో అంతే సంగతులు..

తస్మాత్ జాగ్రత్త.. ఎక్కడ పడితే అక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టారో అంతే సంగతులు..

పనికొచ్చే తెలివి తేటలు ఒక్కటి లేవు. ఎంత సేపు పక్కవాడి మీదే కన్ను. కాణీ కష్టపడకుండా కాసులు వస్తే హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తినొచ్చనుకుంటారో ఏమో. ఏ మార్గంలో ఎదుటి వాడి అకౌంట్ ఖాళీ చేద్దామా అన్న ఆలోచన తప్పించి మరో పని ఏమీ ఉండట్లేదు సైబర్ నేరగాళ్లకి. ఆఖరికి ఛార్జింగ్ పాయింట్లను కూడా వదలట్లేదు చోరీ చేయడానికి. తాజాగా జరిగిన సంఘటనే ఇందుకు సాక్ష్యం. ఢిల్లీ టూర్‌కి వెళ్లిన ఓ వ్యక్తి తన ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోవడంతో దగ్గరలోని ఛార్జింగ్ పోర్ట్ దగ్గరకు వెళ్లి యూఎస్‌బీ పోర్టు నుంచి ఛార్జింగ్ పెట్టుకున్నాడు. ఛార్జింగ్ అయిపోయిన తరువాత ఫోన్ చూసుకుంటే ఏముంది.. బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ.

షాక్ నుంచి తేరుకోకముందే ఫోన్ కాల్.. నీ పర్సనల్ ఫోటోలు, వీడియోలు మా దగ్గరున్నాయ్. అడిగినంత డబ్బు ఇవ్వకపోయావో నీ ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న నెంబర్లకు పంపిస్తా అంటూ బెదిరింపు కాల్.. ఒంటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఒక్క ఉదుటన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి పరిగెట్టాడు. సైబర్ క్రైం కింద కేస్ బుక్ చేసిన పోలీసులు.. అతడి ఫోన్ జ్యూస్ జాకింగ్‌కు గురైనట్లు గుర్తించారు.

ఇదేంటి కొత్తగా ఉంది.. ఈ పదం కూడా ఎప్పుడూ వినలేదే.. అసలేంటి జ్యూస్ జాకింగ్ అని ఆరా తీస్తే.. గ్లాసులో ఉన్న జ్యూస్‌‌ని స్ట్రాతో తాగినట్లు.. యూఎస్‌బీ పోర్టు ఛార్జర్ ద్వారా ఫోన్లో డేటా అంతా కొట్టేస్తారు. ఈ మధ్య ఎక్కడ చూసినా ఛార్జింగ్ ఫోర్టులు ఉంటున్నాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ స్టేషన్లో ఉండే ఛార్జింగ్ పోర్టులతో జాగ్రత్త ఉండడం ఎంతైనా అవసరం. అసలు అక్కడ ఛార్జింగ్ పెట్టుకోకపోవడమే మంచిది. సైబర్ నేరగాళ్లు ఛార్జింగ్ కోసం పెట్టిన యూఎస్‌బీ పోర్టులను మార్చేస్తున్నారు. వాటి స్థానంలో అచ్చంగా అలాగే ఉండేలా సొంతంగా తయారు చేసిన పోర్టులను పెట్టేస్తున్నారు. ఎవరైనా ల్యాప్‌టాప్‌లకు, ఫోన్లకు ఛార్జింగ్ పెట్టారనుకోండి.. ఛార్జింగ్ అవుతూనే డేటా మొత్తం లాగేస్తుంది. ఫోన్ మీ చేతిలో.. మీ డేటా వారి చేతిలో.. అదీ సంగతి.. అందుకే తస్మాత్ జాగ్రత్త.

Read MoreRead Less
Next Story