పూర్ణిమ కేసులో వీడని చిక్కు ముడులు

పూర్ణిమ కేసులో వీడని చిక్కు ముడులు
X

sanat-nagar

హైదరాబాద్ సనత్‌నగర్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పూర్ణిమ కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పెళ్లైన 12 రోజులకే అత్తవారింట్లో పూర్ణిమ శవమై కనిపించడం సంచలనంగా మారింది. సూసైడ్ చేసుకుందని భర్త చెప్తుంటే.. కాదు చంపేశారని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. ఇప్పుడీ కేసులో పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ బయటకు వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అలాగే డైరీలోదొరికిన లెటర్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి.. అది పూర్ణిమ రాసింది అవునా కాదా నిర్థారించుకునే పనిలో ఉన్నారు పోలీసులు.

నవంబర్ 22న ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న అమ్మాయి రెండు వారాల్లోనే చనిపోయిందంటే.. అత్తింట్లో ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు పూర్ణిమ తండ్రి. ఆత్మహత్య చేసుకుంటే పూర్ణిమ తల వెనుక గాయం ఎందుకుందని ప్రశ్నిస్తున్నారు. జులాయిగా తిరిగే కార్తీక్ తన కూతురిని మోసం చేసి పెళ్లి చేసుకుని చివరకు చంపేశాడని పూర్ణిమ అన్నపూర్ణ తండ్రి ప్రసాద్ కన్నీరు పెడుతున్నారు.

ఈ కేసులో ప్రస్తుతం కార్తీక్‌ను, అతని తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సోమవారం రాత్రి ఏం జరిగిందో ఆరా తీశారు. కార్తీక్ పుట్టిన రోజు కావడంతో ఫుల్‌గా మద్యం తాగాడు. ఆ సమయంలో పూర్ణిమ తన మొబైల్‌కు వచ్చిన ఓ మెసేజ్ డిలీట్ చేయడంతో వివాదం మొదలైంది. మంగళవారం కూడా అదే విషయంపై వాగ్వాదం జరిగింది. ఆ సాయంత్రం అనుమానాస్పదంగా పూర్ణిమ చనిపోయింది. ఐతే.. ఇది ఆత్మహత్యేనని భర్త చెప్తున్నాడు. ఉరి వేసుకున్న విషయం గుర్తించి తాము డెడ్‌బాడీని కిందికి దించేందుకు చేసిన ప్రయత్నంలో పట్టుతప్పి పక్కన ఉన్న సిలెండర్‌పై పడడం వల్లే తల వెనుక గాయమైందంటున్నాడు. ఐతే ఇదంతా నమ్మసక్యంగా లేదని పూర్ణిమ కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

అటు, పూర్ణిమ రాసినట్టుగా చెప్తున్న నోట్‌ను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. కార్తీక్ అంటే తనకు ఇష్టమని, US వెళ్లి సెటిలవ్వాలని అనుకున్నానని అందులో రాసింది. తాను తన తండ్రిని మోసం చేశాను తప్ప.. కార్తీక్‌ను మోసం చేయలేదని చెప్పింది. ఈ లెటర్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఒకట్రెండు రోజుల్లోనే పూర్ణిమది హత్యా.. ఆత్మహత్యా తేలుతుందని పోలీసులు చెప్తున్నారు.

పూర్ణిమ తండ్రి చెప్తున్న దాని ప్రకారం కార్తీక్‌ జులాయి మనస్తత్వం ఉన్నవాడు. తన కంపెనీలోనే పనిచేస్తూ తన కూతురిని ప్రేమించాడని ఈ విషయం తెలిసి ఉద్యోగం నుంచి తొలగించానని వివరించారు. ఐతే.. ఆ తర్వాత మాయమాటలతో తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని కాళ్ల పారాణి ఆరకముందే ప్రాణం తీశారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Next Story

RELATED STORIES