కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధం ప్రకటించిన టీ కాంగ్రెస్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధం ప్రకటించిన టీ కాంగ్రెస్

uttam

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. భారత్ బచావో తరహాలో తెలంగాణ బచావో కార్యక్రమం ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నామన్నారు. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం, మద్యం నియంత్రణ, మున్సిపల్ ఎన్నికలు, అధికార పార్టీ వైఫల్యాలు, టీఆర్‌ఎస్‌ హామీలపై నాయకులు చర్చించారు. ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశాన్ని రక్షించండి.. రాజ్యాంగాన్ని రక్షించండి అనే నినాదంతో ర్యాలీలు చేపట్టాలని ఏఐసీసీ ఆదేశించినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ధరల పెరుగుదల, ఆర్థిక వృద్ధి, మందగమనం తదితర అంశాలను ప్రజలోకి తీసుకెళ్లాలని నాయకులు నిర్ణయించారు. కేంద్రంలో ప్రభుత్వ వైఫల్యాల దృష్టి మళ్లించడానికే బీజేపీ పౌరసత్వ సవరణ బిల్లు తీసుకువచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో NRCని.. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయమని కేసీఆర్‌ ప్రకటించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

అటు.. మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడిన అనంతరం మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మైక్‌ తీసుకుని.. నా పేరు పొన్నాల లక్ష్మయ్య అని చెప్పడం ఆసక్తి రేపింది. ఐతే.. వేదికపై ఉత్తమ్ కుమార్‌ రెడ్డి.. పొన్నాల పేరును ప్రస్తావించకపోవడం వల్లే.. ఆయన ఇలా మాట్లాడినట్లు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story