తాజా వార్తలు

త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నగారా

త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నగారా
X

election

తెలంగాణలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం, మున్సిపల్‌ శాఖ ప్రాథమిక కసరత్తును మరింత ముమ్మరం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో 3149 వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం వార్డుల పునర్విభజనను పూర్తి చేసి అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే వార్డుల వారిగా ఎలక్టోరల్ రోల్స్, బీసీ ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి చేయనుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. పునర్విభజన చేసిన వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారు.

ఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల కోసం గడువు ప్రకటిస్తారు. ఆ గడువులోగా ఎవరైనా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలుపవచ్చు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది ఓటర్ల జాబితాను నెలాఖర్లోగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఓటర్ల జాబితా ఆధారంగా మున్సిపల్ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి తెలపనుంది. రిజర్వేషన్లు ఖరారు కాగానే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా షెడ్యూల్ విడుదల చేస్తుంది. అయితే హడావుడిగా కాకుండా కాస్త నిదానంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ జాబితా రూపొందిస్తుంది. ఈ సారి ఎలాంటి కోర్టు వివాదాలకు అవకాశం ఇవ్వొద్దని భావిస్తున్నట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

జనవరి, 2020 తొలివారంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. ఐతే.. ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అయితే మున్సిపల్ ఎన్నికలు సంక్రాంతి తర్వాతే జరిగే అవకాశాలున్నాయి. షెడ్యూల్ కూడా సంక్రాంతి తర్వాతే విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఫిబ్రవరి, 2020లో మున్సిపల్ కొత్త పాలకమండళ్ళు కొలువుదీరే అవకాశం ఉంది.

Next Story

RELATED STORIES