నల్గొండ జిల్లా తేరటిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న సర్పంచ్ శ్రీశైలం

నల్గొండ జిల్లా తేరటిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న సర్పంచ్ శ్రీశైలం

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలంటారు. గ్రామాలు సుభిక్షంగా ఉంటేనే.. దేశం సుసంపన్నంగా ఉంటుందన్నారు జాతిపిత గాంధీ. ఆ మాటలను ఓ యువ సర్పంచ్ సాకారం చేస్తున్నారు. తెలంగాణలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన శాయశక్తులా కృషి చేస్తూ.. అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం తేరటిపల్లి గ్రామానికి అన్ని గ్రామ పంచాయతీల్లాగానే.. సమస్యలున్నాయి. తాగునీరు, మురుగు కాల్వలు, వీధి దీపాలు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. గతేడాది యువకుడు, విద్యావంతుడైన వీరమల్ల శ్రీశైలం.. కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ గా బరిలోకి దిగి భారీ మెజారిటీతో గెలిచి గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నారు.

సర్పంచ్ ఎన్నికల సమయంలోనే.. గ్రామ సమస్యలపై విలేజ్ మ్యానిఫెస్టో సిద్దంచేశారు శ్రీశైలం. చేయాల్సిన పనుల లిస్ట్‌తో ఏడాదికొక యాక్షన్ ప్లాన్ సిద్దంచేశారు. సర్పంచ్ గా బాద్యతలు స్వీకరించాక.. ప్రభుత్వ నిధులతోపాటు.. స్థానిక MLA రాజగోపాల్ రెడ్డితోపాటు, ఇతర దాతల సహకారంతో.. అభివృద్ది పనులను పూర్తిచేసుకుంటూ వెళ్తున్నారు. ఈక్రమంలో.. ఏడాది పాలన పూర్తైన సందర్బంగా.. తేరేటిపల్లి గ్రామంలో మన ఊరు-మన అభివృద్ది పేరుతో భారీ సభను ఏర్పాటుచేశారు.

సర్పంచ్‌గా ఎన్నికైన నాటికి ఇచ్చిన వాగ్దానాలు.. ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ది పనులు.. రాబోయే కాలంలో చేయాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయన్నారు సర్పంచ్‌ శ్రీశైలం. గ్రామాభివృద్ధి ధ్యేయంగా.. గ్రామంలో పుట్టి పెరిగి.. ఇతర ప్రాంతాల్లో ఉన్నతస్థితిలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నవారిని సంప్రదించామన్నారు. మొదట సొంత నిధులతోనే పనులు ప్రారంభించి.. మిగతావారికి నమ్మకం కలిగించారు. గ్రామంలో రహదారుల మరమ్మతులు, మురుగు కాల్వల పునరుద్ధరణ, సొంత నిధులతో గ్రామ రక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. గ్రామ పిల్లలకు విద్య, అందరికీ ఆరోగ్యం కోసం ప్రభుత్వాసుపత్రి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా.. పెద్ద వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేశారు సర్పంచ్‌. స్మశానం తరలించేందుకు వైంకుంఠధామనే ప్రత్యేక వాహనం ఏర్పాటుచేశారు. తేరేటిపల్లి గ్రామ సర్పంచ్ శ్రీశైలం చేస్తోన్న అభివృద్దిని విని, చూసి తాముసైతం గ్రామానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చామంటున్నారు విద్యావంతులు. మారుతున్న టెక్నాలజీ తగ్గట్టుగా.. గ్రామ ప్రభుత్వ పాఠశాలలో డీజీ క్లాస్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే పుట్టి, పెరిగి.. ఉన్నతస్థాయిలో స్థిరపడ్డవారిని రప్పించి.. గ్రామం కోసం కృషి చేస్తోన్న సర్పంచ్‌కి అభినందనలు తెలుపుతున్నారు స్థానిక విద్యావంతులు.

నాయకులు గతంలో మాటలు చెప్పి.. చేతల్లో తప్పించుకున్నారనీ.. ప్రస్తుతం తమ సర్పంచ్ శ్రీశైలం ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్నారని స్థానిక యువకులు అంటున్నారు. తమ గ్రామ అభివృద్ధి చేతనైన సాయం చేస్తున్నామని యువకులు తెలిపారు. ఓ ప్రమాదంలో కాలికి ముళ్లు గుచ్చుకుని కాలు కోల్పోయిన యువకుడికి.. సర్పంచ్‌ శ్రీశైలం ఆర్థిక సహాయం చేసి కృత్రిమ కాలు పెట్టించారు. ఇలాంటి సర్పంచ్‌లు ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని యువత అంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. నెలనెల వస్తోన్న నిధులతోపాటు.. సొంత నిధులు ఖర్చు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు సర్పంచ్ శ్రీశైలం. గ్రామం నుంచి వెళ్లి ఆయా రంగాల్లో స్థిరపడిన వారంతా తమ వంతుగా గ్రామాభివృద్దికి చేయూత నివ్వాలని.. తేరేటిపల్లి సర్పంచ్ శ్రీశైలం విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story