అందుకే పరిపాలన వికేంద్రీకరణ చేపట్టాం : ప్రధాని తో జగన్

అందుకే పరిపాలన వికేంద్రీకరణ చేపట్టాం : ప్రధాని తో జగన్
X

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్రమోదీతో గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. విభజన అంశాలు, ప్రత్యేకహోదా, పోలవరం నిధులు తదితర అంశాలపై వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఉగాది రోజున 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని.. ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు జగన్. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు అందజేయాలనే ఉద్దేశంతో ఇల్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాల్సిందిగా కోరారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానికి సీఎం తెలిపారు. అందుకే పరిపాలన వికేంద్రీకరణ చేపట్టామని వినతిపత్రంలో పేర్కొన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ-అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం 2020కి అసెంబ్లీ కూడా ఆమోదముద్ర వేసిందని తెలిపారు.

శాసనమండలి రద్దు అంశాన్ని సీఎం వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రూపొందించిన బిల్లులను మండలి అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని వివరించారు. ఈ నేపథ్యంలోనే మూడింట రెండొంతుల మెజారిటీతో శాసన మండలిని రద్దు చేస్తూ శాసనసభ తీర్మానం చేసిందని సీఎం ప్రధానికి తెలిపారు. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపామని.. ఈ అంశంలో తదుపరిచర్యలకోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని మోదీకి జగన్‌ విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఏపీ దిశ చట్టం-2019కు ఆమోదం తెలపాలని కోరారు.

2021 నాటికి పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రధానికి అందజేసిన వినతిపత్రంలో సీఎం పేర్కొన్నారు. ప్రాజెక్టు అంచనాలు 55 వేల 549 కోట్లకు చేరిందని.. దీనిలో ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసమే 33 వేల 10 కోట్లు అవసరమవుతుందని తెలిపారు. దీనికి పాలనాపరమైన అనుమతులు ఇంకా రాలేదని.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలపాలని కోరారు. ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా 3 వేల 320 కోట్లు రావాల్సి ఉందని.. ఆ మొత్తం విడుదల చేయాల్సిందిగా జలవనరుల శాఖను ఆదేశించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరారు. ‘హోదా’ ఇవ్వడానికి ఆర్థిక సంఘం సిఫార్సులు అవసరం లేదంటూ 15వ ఆర్థిక సంఘం చెప్పిన విషయాన్ని లేఖలో జగన్‌ ప్రస్తావించారు. రాష్ట్రంలో రెవెన్యూ లోటు 22 వేల 948 కోట్లుగా కాగ్‌ అంచనా వేసిందని.. కేంద్రం నుంచి ఇంకా 18 వేల 969 కోట్లు రావాల్సి ఉందన్నారు. కడప ఉక్కు కర్మాగారం, రామాయపట్నం పోర్టు, కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని కోరారు. రాజధాని నిర్మాణానికి 2 వేల 500 కోట్లు కేటాయిస్తే కేవలం 1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని..మిగిలిన నిధులనూ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెనుకబడిన 7 జిల్లాలకు గడిచిన ఆరేళ్లలో కేవలం 1050 కోట్లు మాత్రమే ఇచ్చారని.. గడిచిన మూడేళ్ల నుంచి కేటాయింపులు కూడా లేవని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌, కలహండి నమూనాలో నిధులివ్వాలని కోరారు సీఎం జగన్.

Next Story

RELATED STORIES