క్యాట్‌లో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ..

క్యాట్‌లో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ..

ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి క్యాట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. కృష్ణ కిషోర్‌పై ఉన్న కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకు వెళ్లొచ్చని చెప్పింది.

చంద్రబాబు హయాంలో ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డ్‌- AP EDBకి సీఈవోగా పనిచేశారు జాస్తి కృష్ణ కిషోర్. 1990 బ్యాచ్‌కు చెందిన ఈ IRS అధికారిని జగన్ CM అవుతూనే పక్కకుపెట్టారు. ఆయనకు జీతం సైతం నిలిపివేశారు. EDBలో అక్రమాలు జరిగాయంటూ దీనిపై విచారణ జరపాలని CID, ACBలకు ఆదేశాలిచ్చారు. కృష్ణ కిషోర్ నిధుల దుర్వినియోగం సహా ప్రభుత్వ అనుమతి లేకుండా సుమారు 16 కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు జారీ చేయడాన్ని తప్పు పడుతూ కేసు కూడా నమోదు చేశారు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్‌మెంట్స్ నుంచి వచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా అక్రమాలు జరిగియాని నిర్థారణకు వచ్చి ఆయనసై సస్పెన్షన్‌ వేటు వేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణ కిషోర్ క్యాట్‌ను ఆశ్రయించడంతో ఎట్టకేలకు ఊరట లభించింది.

జాస్తి కృష్ణ కిషోర్‌పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదమైంది. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఫిర్యాదుతో కృష్ణ కిషోర్‌పై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఆరు నెలల్లో దీనిపై విచారణ చేయాలని ప్రభుత్వం సూచించింది. అప్పటి వరకూ ఆయన అమరావతి విడిచి వెళ్లకూడదని కూడా ఆదేశించారు. దీనిపై వెంటనే క్యాట్‌ను ఆశ్రయించారు కృష్ణ కిషోర్‌. EDB సీఈవోగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికిపాల్పడ్డారనేది అభియోగంపై కృష్ణ కిషోర్‌ తరపు అడ్వొకేట్‌ క్యాట్‌లో వాదనలు వినిపించారు. తమవైపు నుంచి కొన్ని డాక్యుమెంట్లు సమర్పించారు. దీనిపై పలు దశల్లో వాదనల తర్వాత చివరికి ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. సస్పెన్షన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఆయనకు అవకాశం ఇచ్చింది.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే తనను పక్కకు పెట్టడంతో కేంద్ర సర్వీసులకు వెళ్లాలని కృష్ణ కిషోర్ భావించారు. ఐతే.. ప్రభుత్వం ఆయన్ను రిలీవ్ చేయలేదు. ఇంతలోనే CID కేసు కూడా నమోదైంది. జీతం ఆపేశారు. దీనిపై ఆయన క్యాట్‌కు వెళ్లడంతో జీతం ఇచ్చినా.. సస్పెన్షన్ ఉత్తర్వల రద్దుపై పలు దఫాలుగా వాదనలు జరిగాయి. చివరికి క్యాట్‌లో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.

Tags

Read MoreRead Less
Next Story