Top

ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు సర్వత్రా వ్యతిరేకత

ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు సర్వత్రా వ్యతిరేకత
X

ఇళ్ల స్థలాల కేటాయింపుల పేరుతో దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములను లాక్కోవడంపై ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ సర్కార్ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ముక్కంపాడులో భూములను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన రెవిన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తాము నివాసం వుంటున్న భూముల్ని ఎలా స్వాధీనం చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు, ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. అంతేకాదు, రెవిన్యూ, పోలీస్ సిబ్బందిపైనా డీజిల్ పోశారు. అయినా, ఘటనాస్థలానికి భారీగా తరలివచ్చిన పోలీసులు, రెవిన్యూ ఉన్నతాధికారులు.. దగ్గరుండి ఇళ్లను ధ్వంసం చేయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలింది. జంగారెడ్డి గూడెం డీఎస్పీ స్నేహిత సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయంలో అధికారులు అమలు చేస్తున్న తప్పిదాల వ్లల నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారంటూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో బాధితులు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. శింగరాయకొండ మండలం పాకలలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు 40 ఏళ్ల క్రితం నిరుపేదలకు కేటాయించిన ఉప్పు కొటారు భూములను తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించడాన్ని తప్పుబట్టారు. గ్రామంలో భూస్వాములు, రాజకీయ నేతల దగ్గర ఎకరాలకు ఎకరాలు వున్నా.. వాటి జోలికి వెళ్లడం లేదని.. పేదలకు ఇచ్చిన భూములను మాత్రం లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇళ్ల స్థలాల కోసం భూములను లాక్కోవడంపై కడప జిల్లాలోనూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్టాభూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నానాపల్లె రెండో డివిజన్ లో రైతులు వ్యవసాయం చేసుకుంటున్న భూముని స్వాధీనం చేసుకుని.. అందులో ఒక సెంటు భూమిని ఇంటి స్థలం కోసం కేటాయించారు. దీనిపై టీడీపీ జిల్లా కార్యదర్శి హరిప్రసాద్, అసెంబ్లీ ఇంచార్జి అమీర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 65 ఎకరాల డీకేటీ భూమి ఖాళీగా వుందని.. అయితే, ఆ భూమి వైసీపీ నాయకుల ఆధీనంలో వుండటంతో.. ఆ భూమిని కాదని పచ్చని భూముల్లో ఇళ్ల స్థలాలకు పట్టాలిస్తున్నారని అన్నారు.

జిల్లా ఫిరంగిపురం మండలం అల్లంవారిపాలెంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో.. వాళ్లు గ్రామాలకు వెళ్లి భూసేకరణ చేపట్టారు. అయితే.. గతంలో ఇళ్ల కోసం కేటాయించిన భూములు లాక్కోవడం ఏమిటంటూ అల్లంవారిపాలెం గ్రామస్తులు నిలదీశారు. బలవంతంగా తమ స్థలాలు లాక్కుంటే.. బలవన్మరణానికి పాల్పడతామంటూ గ్రామస్తులు హెచ్చరించారు. పురుగు మందు డబ్బాలు చేతిలో పట్టుకుని ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Next Story

RELATED STORIES