'ఓ పిట్టకథ' రివ్యూ

ఓ పిట్టకథ రివ్యూ

రివ్యూ : ఓ పిట్టకథ

తారాగణం : సంజయ్, విశ్వాంత్, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ తదితరులు

సంగీతం : ప్రవీణ్ లక్కరాజు

కెమెరా : సునిల్ కుమార్ ఎన్

నిర్మాత : భవ్య ఆనంద్ ప్రసాద్

దర్శకత్వం : చెందు ముద్దు

ఓ పిట్టకథ.. ఈ మధ్య కాలంలో ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేసిన సినిమా. మెగాస్టార్ నుంచి మినీ స్టార్ వరకూ ఎవరినీ వదలకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమా నాలుగు ముక్కలు మాట్లాడేలా చేసింది మూవీ టీమ్. అందుకు ప్రధాన కారణం ఈ మూవీలో ఓ హీరోగా నటించిన సంజయ్ రావు.. అతనెవరూ అంటారా నటుడు బ్రహ్మాజీ కొడుకు కావడం.. విశ్వాంత్, నిత్య శెట్టి ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉంది.. ప్రమోషన్స్ తో ఓ రేంజ్ లో ఊదరగొట్టిన ఈ మూవీలో విషయం ఉందా..? లేదా..? ఇప్పుడు చూద్దాం..

వెంకటలక్ష్మి(నిత్యా శెట్టి) అనే అమ్మాయి.. తల్లి చనిపోవడంతో తండ్రితో కలిసి ఉంటుంది. కాలేజ్ లో చదువుకుంటోన్న వెంకటలక్ష్మి ఇంటికి ఆమె మేనబావను అంటూ క్రిష్(విశ్వాంత్) అనే ఓ కుర్రాడు వస్తాడు. అతనితో తను ప్రేమలో పడుతుంది. ఈ లోగా ఓ టూర్ కు వెళ్లిన ఆమెను ఎవరో కిడ్నాప్ చేస్తారు. తండ్రి, మేనబావ వెళ్లి పోలీస్ కంప్లైంట్ చేస్తారు. అయితే క్రిష్ తనకు ప్రభు(సంజయ్ రావు) అనే కుర్రాడిపై డౌట్ ఉందని చెబుతాడు. పోలీస్ లు ప్రభును తెచ్చి ఇంటరాగేట్ చేస్తారు. కానీ ప్రభు, వెంకటలక్ష్మి లవర్స్ అని తెలుస్తుంది. ఇటు క్రిష్ కూడా తను వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకోబోతోన్నట్టు చెబుతాడు. మరి ఆమెను కిడ్నాప్ చేసింది ఎవరు..? ఎందుకు చేశారు..? పోలీస్ లు ఈ కేస్ ను ఎలా ఛేదించారు అనేది మిగతా కథ..

సినిమా పరిశ్రమలోనే కాదు.. ఎక్కడైనా ఎప్పుడైనా వినిపించే ఓ మాట ఉంది. విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్ పీక్స్ లో ఉంటుంది. ఆ మాట ఈ పిట్టకథకు అక్షరాలా సరిపోతుంది. విషయం పిట్టకథంత ఉంటే దాన్ని సీరియల్ రేంజ్ లో లాగిలాగి మరీ విసిగించారు అనిపిస్తుంది. ఓ సాధారణ ట్రైయాంగిల్ లవ్ స్టోరీకి ట్విస్ట్ లు, సస్పెన్స్ లు అంటూ జోడించిన దర్శకుడు.. అందుకు తగ్గ ఆర్టిస్టులను ఎంచుకోవడంలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దీంతో ఈ సాధారణ కాస్తా బోరింగ్ స్టోరీగా మారిపోయింది.

ఓ పిట్టకథ.. ఈ మూవీలో దర్శకుడు చెప్పుకున్నట్టు అనేక కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. వాటికి సరైన దారిలో క్లారిటీ ఇవ్వడం దర్శకుడి సక్సెస్ ను చెబుతుంది. కానీ ఆ విషయంలో కూడా దర్శకుడు దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అనేక పీట ముడులు వేసుకుని.. వాటిని క్లియర్ చేసే క్రమంలో ఒకే సీన్ పదే పదే వస్తూ విసిగిస్తూ ఉంటుంది. రిపీటెడ్ సీన్స్ తో ఓ దశలో చిరాకు పెట్టిస్తాడు. పోనీ ఆ రిపిటేషన్ లో అయినా ఏమన్నా థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుందా అంటే సులువుగా ఊహించగలిగేదే అయి ఉంటుంది.

ప్రేమకథలకు నటులు మరీ ఎక్స్ పర్ట్స్ కానక్కర్లేదు. కానీ ఆ కథకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నటన అవసరం. అది ఈ సినిమాలో పూర్తిగా లోపించింది. తన కొడుకు అంటూ బ్రహ్మాజీ గ్రాండ్ గా పరిచయం చేసిన సంజయ్ లో భూతద్దంతో వెదికినా ఒక్కటంటే ఒక్క ఎక్స్ ప్రెషనూ కనిపించదు. అసలు ఏ ఎమోషన్ కు అయినా ఓకే ఎక్స్ ప్రెషన్ పలికించడం కూడా ఓ రకంగా గ్రేటేనేమో. అది చాలదన్నట్టు పోలీస్ గా నటించిన బ్రహ్మాజీ సైతం బ్లాంక్ గానే ఉండటం ఆశ్చర్యం. ఓ అమ్మాయి మిస్సింగ్ కేస్ డీల్ చేసే ఎస్సై అంత డంబ్ గా ఉండటం ఈ మధ్య ఏ చిన్న సినిమాలోనూ చూడలేదు. హీరోయిన్ క్యూట్ గా ఉంది. పాత్రకు తగ్గ ఛలాకీదనం చూపింది. అటు విశ్వాంత్ పాత్ర బావున్నా నటన తేలిపోయింది.

పరిమిత పాత్రలతో అపరిమితమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన పిట్టకథకు పాటలు మైనస్ గా మారాయి. సినిమాటోగ్రఫీ కొన్నిచోట్ల సూపర్బ్ అనిపిస్తే మరికొన్నిచోట్ల నాసిరకంగా ఉంటుంది. మాటలు ఏమంత బాలేదు. కామెడీ పేరుతో చేసిన పాతకాలపు పంచులూ పేలలేదు. కానీ ఆ నటుడి టైమింగ్ బావుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నా.. అప్పటికే సినిమాపై పూర్తిగా ఇంట్రెస్ట్ కోల్పోయేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అందువల్ల అవీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మొత్తంగా ప్రమోషన్స్ హడావిడీ తప్ప సినిమాలో పసలేదు. కనీసం యూత్ ను ఆకట్టుకునే అంశాలూ లేనందున ఈ పిట్టకథ రొటీన్ కథగా మిగిలిపోవచ్చేమో..

ప్లస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్టులు

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

ఆర్టిస్టులు

స్క్రీన్ ప్లే

సంగీతం

సినిమాటోగ్రఫీ

పాటలు

ఫస్ట్ హాఫ్

రిపీటెడ్ సీన్స్

ఫైనల్ గా : పిట్టకొంచెం.. కూత మరీ కొంచెమే

రేటింగ్ : 1/5

- బాబురావు. కామళ్ల

Tags

Read MoreRead Less
Next Story