తాజా వార్తలు

సొంత రాబడులపై ధీమాతో బడ్జెట్ ను రూపొందించిన తెలంగాణ ప్రభుత్వం

సొంత రాబడులపై ధీమాతో బడ్జెట్ ను రూపొందించిన తెలంగాణ ప్రభుత్వం
X

సొంత రాబడులపై ధీమాతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు సభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. మండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ పద్దు సమర్పిస్తారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి హరీష్‌రావు కొండాపూర్‌లోని తన నివాసం నుంచి బడ్జెట్‌ పద్దుతో అసెంబ్లీకి బయలుదేరారు.. ప్రధాన పథకాలు,ఎన్నికల హామీలు, అభివృద్ధి లక్ష్యాలు, ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత బడ్జెట్‌ కంటే 15-16 శాతం పెంచినట్లు తెలుస్తోంది. లక్షా 56 వేల కోట్ల నుంచి.. లక్షా 59 కోట్ల మధ్య బడ్జెట్‌ ఉంటుందని సమాచారం..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో శనివారం రాత్రి జరిగిన మంత్రిమండలి సమావేశం బడ్జెట్‌ను ఆమోదించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి లక్షా 46 వేల కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదించారు. అందులో భూముల అమ్మకాల ద్వారా వచ్చే రాబడి అంచనాలు 10 వేల కోట్లు మినహాయించి, బడ్జెట్‌ను లక్షా 36 వేల కోట్లుగానే పేర్కొంది ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరానికి దాదాపు లక్షా 70 వేల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించాలని మొదట అనుకున్నప్పటికీ.. ఆర్థికమాంద్యం ఇతరత్రా కారణాలతో రాబడికాస్త తగ్గడంతో వాస్తవికతకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసేలా ఈ బడ్జెట్‌లో కేటాయింపులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. సంక్షేమం, వ్యవసాయానికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆసరా పింఛన్లకు వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించనున్న నేపథ్యంలో లబ్ధిదారులు 7 లక్షల మంది పెరగనున్నారు. దీంతో పింఛన్లకు 12 వేల కోట్ల కంటే ఎక్కువ మొత్తం ప్రతిపాదించారు. కొత్తగా మరో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తెలిసింది. వచ్చే నాలుగేళ్లలో రైతు రుణమాఫీని పూర్తి చేసేలా తాజా బడ్జెట్‌లో 6 వేల కోట్లు ప్రతిపాదించనున్నట్లు సమాచారం.. ఉద్యోగుల వేతన సవరణ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేయాల్సి ఉంటుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపుపైనా ప్రభుత్వం దృష్టిసారించింది.

సాగునీటి రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందుకోసం 9 నుంచి 10 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణం దీనికి అదనం. ప్రాజెక్టులకు తీసుకొచ్చే రుణాలకు మార్జిన్‌మనీ, వడ్డీల చెల్లింపు మొదలైన అవసరాలకు బడ్జెట్‌లోనే కేటాయింపులు చేయనున్నారు. కేంద్రం నుంచి ఆశించినస్థాయిలో నిధులు రాకపోవడంతో క సొంత రాబడులను గణనీయంగా పెంచుకోవాలి ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ ద్వారా శాఖల్లో అనవసర వ్యయాలకు అడ్డుకట్ట వేయనుంది. జీఎస్టీ, అమ్మకం పన్నుతోపాటు పన్నేతర రాబడులపైనా దృష్టి సారించనుంది.

Next Story

RELATED STORIES