అగ్రరాజ్య అధ్యక్షుడు మొన్న అలా.. ఈరోజు ఇలా..

అగ్రరాజ్య అధ్యక్షుడు మొన్న అలా.. ఈరోజు ఇలా..

కరోనా మహమ్మారికి అగ్రరాజ్యమే వణికిపోతోంది. ఈ వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువవుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. ముందు 15 రోజుల పాటు జనసంచారంపై ఆంక్షలు విధించారు. కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువవుతుండడంతో మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి అంతకు మించిన మార్గం కనపబడడం లేదని ఆయన అన్నారు. ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈస్టర్ పర్వదినం నాటికి అంతా సద్ధుమణుగుతుందని తాను ఆశించానని అన్నారు. కానీ పరిస్థితి అలా కనిపించడంలేదని నిరాశ వ్యక్తం చేశారు.

అమెరికాలో లక్షమందికి పైగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పువుందని ఆ దేశ ఆరోగ్య శాఖ నిపుణుడు ఆంథోనీ ఫాసీ అంచనా వేశారు. ఈ సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజులు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యేలా చూడాలని ట్రంప్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అమెరికాలో కోవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య 1,42,226. కాగా, వీరిలో 2,493 మంది మరణించారు, 4,443 మంది కోలుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story