ఇకపై విద్యుత్ రంగం కేంద్రం చేతుల్లో..

ఇకపై విద్యుత్ రంగం కేంద్రం చేతుల్లో..

రాష్ట్రాల్లో ప్రభుత్వం మారినప్పుడల్లా విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసేలా చర్యలు ఉంటున్నాయని భావించిన కేంద్రం ఇకపై ఈ ఆటలు సాగవంటోంది. ఈ మేరకు పలు సవరణలు చేపట్టనుంది. అయితే కేంద్రం తీసుకొస్తున్న ఈ సవరణల్లో రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్, మరో ఇద్దరు సభ్యుల నియామకం అత్యంత ప్రధానమైనది. ఇప్పటి వరకు ఈ నియామకాలు రాష్ట్రప్రభుత్వాలే చేపడుతున్నాయి. ఇకపై వీటిని కేంద్రం చూసుకుంటుంది. జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి చైర్మన్‌గా విద్యుత్ రంగ నిపుణులతో కూడిన కమిటీని వేస్తారు.

ఈ కమిటీ రాష్ట్రాల చైర్మన్లను, సభ్యుల పేర్లను సిఫారసు చేస్తుంది. ఈ మేరకు కేంద్రమే సభ్యులను నియమిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ, నిర్వహణ వ్యయాలను రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. మరో ముఖ్య సవరణ రాష్ట్రాలు వివిధ వర్గాలకు ప్రకటించే రాయితీలకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్)లు ఏ మాత్రం బాధ్యత వహించవు. వీటన్నింటినీ రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే డిస్కమ్‌లు బలపడతాయని కేంద్రం భావిస్తోంది. కేంద్రం చేయబోయే మరో ముఖ్య సవరణ.. ఒకే దేశం.. ఒకే విద్యుత్ ధర.. అంటే ఇకపై కరెంటు ధరలను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఉండదు. రాష్ట్రాలకు వస్తున్న వాస్తవ ఆదాయ, వ్యయాలను కేంద్రమే సమీక్షించి ధరను నిర్ణయిస్తుంది. అదీ సంగతి.. ఇకపై కేంద్రం స్విచ్ వేస్తే రాష్ట్రంలో లైటు వెలుగుతుందన్నమాట.

Tags

Read MoreRead Less
Next Story