శ్రీవారి ఆస్తుల వేలం వివాదం మధ్య టీటీడీ పాలక మండలి సమావేశం

శ్రీవారి ఆస్తుల వేలం వివాదం మధ్య టీటీడీ పాలక మండలి సమావేశం

గురువారం జరుగనున్న టీటీడీ పాలకమండలి సమావేశానికి సర్వం సిద్ధమైంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు. టీటీడీ ఆస్తుల వేలం వ్యవహారం, మాజీ అర్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో.. ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో జరుగనున్న ఈ సమావేశానికి.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డితో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పాల్గొననున్నారు.

ఈసారి టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం వుంది. ప్రధానంగా టీటీడీ ఆస్తుల విక్రయాలపై నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ అంశం వివాదాస్పదంగా మారింది. గత పాలకమండలి నిర్ణయాలను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మార్చి 20 నుంచి శ్రీవారి దర్శనాలు నిలిపివేయడంతో.. టీటీడీ ఇప్పటికే 400 కోట్ల రాబడి కోల్పోయింది. ఈ క్రమంలో మే నెల జీతాల చెల్లింపు తర్వాత టీటీడీ నిధుల కొరత ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి నిధులు వాడుకోకుండా.. టీటీడీ ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లే యోచనలో వున్నట్టు తెలుస్తోంది. SBIలో టీటీడీకి 0.75 శాతం వడ్డీకే 300 కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్ లభించే అవకాశం వుంది.

ఇక, శ్రీవారి దర్శనాలను తిరిగి ప్రారంభించే సమయంలో.. ఎలాంటి విధానాన్ని పాటించాలన్నదానిపై చర్చించనున్నారు. మొదటి దశలో రోజుకు ఏడు వేల మంది భక్తులకే దర్శనభాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేసి.. తర్వాత విడతలవారీగా మార్పులు తీసుకువచ్చే ప్రతిపాదనకు పాలకమండలి ఆమోదం తెలుపనుంది. మరోవైపు ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన అనుమతులు, గరుడ వారధికి నిధుల కేటాయింపు పై నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది. ఇక, టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ స్థాయికి సంబంధించి 47 పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టే సూచలను కనిపిస్తున్నాయి. మరికొన్ని అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుతో పాటు.. అవిలాల చెరువును తుడాకు అప్పగించే అంశంపైనా చర్చించనున్నట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story