తాజా వార్తలు

కలవర పెడుతున్న కరోనా.. రాష్ట్ర అధికారులకు పాజిటివ్..

కలవర పెడుతున్న కరోనా.. రాష్ట్ర అధికారులకు పాజిటివ్..
X

కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలోని పలువురు అధికారులను పట్టి పీడిస్తోంది. తాజాగా యాదాద్రి సీఈవో దంపతులకు వైరస్ సోకింది. గత వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న ఆయన విధులకు సెలవు పెట్టి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. భార్యకూ జ్వరం రావడంతో ఇద్దరికీ పరీక్షలు చేయగా పాజిటివ్ అని వచ్చింది. సికింద్రాబాద్ లోని రైల్వే డివిజన్ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ డివిజన్ ఫైనాన్స్ మేనేజర్ కు కరోనా సోకింది.

అధికారిణిని పలు సందర్భాల్లో కలిసిన 9 మంది రైల్వే అధికారులను హోం క్వారంటైన్ లో ఉండాలని రైల్వే శాఖ ఆదేశించింది. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు కరోనా సోకడంతో మేయర్ కుటుంబం స్వీయ నిర్భంధంలోకి వెళ్లింది.

ఇక కరోనాపై పూర్తి అవగాహన ఉన్న వైద్యులకూ వ్యాధి సోకడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఒక్క నిమ్స్ లోనే 30 మందికి పైగా వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఉస్మానియా, గాంధీ, పేట్లబురుజు, చెస్ట్ హాస్పిటల్ వైద్యులతో సహా ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు సైతం కరోనా బారిన పడుతున్నారు. శిక్షణ పొందుతున్న ఐపీఎస్ లు, వార్తలు అందిస్తున్న జర్నలిస్టులు కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. వివిధ స్థాయిల్లో ఉన్న ప్రముఖ వ్యక్తులకు వైరస్ సోకడం గత కొద్ది రోజులుగా వెలుగు చూస్తున్న కేసులను బట్టి అర్థమవుతోంది.

వైరస్ గురించి అవగాహన ఉన్న రాజకీయ నాయకులు, అధికారులు సమావేశాల సమయంలో మాస్కులు సరిగా ధరించక పోవడం, సామాజిక దూరాన్ని పాటించక పోవడం వైరస్ వ్యాప్తికి ఎక్కువగా అవకాశాలుంటాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో వైరస్ మరింత తీవ్రంగా ఉండే అవకాశాలున్నందున ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించడం సామాజిక బాధ్యతగా భావించాలని అంటున్నారు. మాస్క్ అసౌకర్యంగా అనిపించినా కరోనా వైరస్ దరిచేరకుండా ఉండాలంటే ధరించక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story

RELATED STORIES