కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం కేసీఆర్.. నాయకులు, కార్యకర్తలు రావద్దని ఆదేశాలు

కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం కేసీఆర్.. నాయకులు, కార్యకర్తలు రావద్దని ఆదేశాలు

గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్నిసోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరామర్శించనున్నారు. సూర్యాపేటలోని కర్నల్‌ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శిస్తారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని సీఎం కేసీఆర్‌ స్వయంగా అందించనున్నారు. సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, హైదరాబాద్ లో ఇంటి స్థలం, గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన సీఎం, తానే స్వయంగా వెళ్లి ఆ సహాయాన్ని అందించనున్నారు. సంతోష్‌ భార్య సంతోషికి గ్రూప్‌-1 ఉద్యోగం, హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో ఇంటిస్థలం ఇవ్వనున్నారు.

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కర్నల్ ఇంటిలోకి వెళ్లేవారి సంఖ్యను కుదించారు. సిఎంతోపాటు మరో నలుగురుమాత్రమే వారి ఇంట్లోకి వెళ్లిపరామర్శించనున్నారు. మంత్రి జగదీష్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌ మాత్రమే సంతోష్‌ ఇంట్లోకి వెళుతారు. అయితే ముఖ్యమంత్రి సూర్యాపేటకు వస్తున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్దయెత్తున వచ్చే అవకాశం ఉండటంతో.. కరోనా నేపథ్యంలో ఎవరు రావద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో సంతోష్‌బాబు ఇంటివద్ద బందోబస్తు పటిష్ఠం చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story