'విటమిన్ డి' తో కరోనా వైరస్ ని ఎదుర్కోవచ్చా..

విటమిన్ డి తో కరోనా వైరస్ ని ఎదుర్కోవచ్చా..

రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి విటమిన్ డి సహాయపడుతుంది. దంతాలకు, కండరాలకు ఇది బలాన్ని చేకూరుస్తుంది. ఇది గుడ్డు సొన, చేపలు, రెడ్ మీట్ లో ఎక్కువగా ఉంటుంది. తృణ ధాన్యాలు, యోగర్ట్ లో కూడా విటమిన్ డి లభిస్తుంది. శరీరంలోని విటమిన్ డి యొక్క అధిక భాగం సూర్యరశ్మి ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఊబకాయం ఉన్నవారిలో, అధిక రక్తపోటు,డయాబెటిస్ ఉన్నవారిలో, ధూమపానం చేసేవారిలో విటమిన్ డి సాంద్రతలు తక్కువగా ఉంటాయి. ఇవి కాల్షియం నియంత్రణను ప్రభావితం చేస్తాయి.

గుండె జబ్బులు ఉన్నవారు తక్కువ ఆహారం తీసుకోవడం, సూర్యరశ్మికి దూరంగా ఉండడం, వారి జీవనశైలి విటమిన్ డి సాంద్రతను తగ్గించటానికి దోహదం చేస్తుంది. ఈ పరిస్థితులు కరోనా వైరస్ బారిన పడడానికి ఎక్కువగా తోడ్పడుతుంది. అందువల్ల తక్కువ విటమిన్ డి ఉన్నవారికి వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని, రోగనిరోధక వ్యవస్థ పనితీరును మందగింపజేస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇలాంటి వారు ఆహారం ద్వారా లేదా సప్లిమెంట్ల నుండి విటమిన్ డి స్థాయిని పెంచుకోవచ్చు.

ఇటలీ, స్పెయిన్, యుకె, చైనా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు విటమిన్ డి లోపంతో బాధపడే జనాభా అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ దేశాలలోనే అధిక సంఖ్యలో కొవిడ్ మరణాలు ఉన్నాయి. అదే ప్రాంతంలోని నార్వే, డెన్మార్క్ మరియు ఫిన్లాండ్ వంటి ఇతర దేశాలు తక్కువ కొవిడ్ మరణాల రేటును కలిగి ఉన్నాయి. అయితే ఈ దేశాలలో ఆహారం ద్వారా విటమిన్ డిని తీసుకుంటారు. కొవిడ్ ను నివారించడానికి విటమిన్ డి తోడ్పడుతుందా అంటే కచ్చితమైన ఆధారాలు లేవంటున్నారు పరిశోధకులు. విటమిన్ డి ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ ఎక్కువైతే శరీరం విషపూరితం కావచ్చు. దాహం ఎక్కువ అవడం, వాంతులు, చేతులు, కాళ్లు తిమ్మిరులు.. మానసిక గందరగోళం వంటి సమస్యలు తలెత్తుతాయి.

కరోనావైరస్ సోకకుండా ఆపడానికి విటమిన్ డి పని చేస్తుందా లేదా అనే అంశం పై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలను సైంటిఫిక్ అడ్వైజరీ కమీషన్ ఆన్ న్యూట్రిషన్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కేర్ ఎక్స్ లెన్స్ పరిశీలించారు. ముఖ్యంగా ఇంటి లోపలే ఎక్కువ సమయం గడిపే ప్రతి ఒక్కరూ రోజుకు 10 మైక్రోగ్రాముల విటమిన్ డి తీసుకోవాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ ఎచ్ ఎస్) సూచిస్తోంది.

బయటకు వెళ్ళినప్పుడు కూడా శరీరం అంతా కప్పేలా దుస్తులు ధరించే వాళ్ళు సంవత్సరమంతా విటమిన్ డి తీసుకోవాలని ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ విభాగం సూచిస్తోంది. సరైన పోషకాహారం తీసుకోవడం వలన శరీరానికి తగిన రోగ నిరోధక శక్తి సమకూరినప్పటికీ , ఏ ఒక్క ఆహార పదార్ధమూ ఒక్క సారిగా శరీర రోగ నిరోధక శక్తిని పెంచలేదు. మహమ్మారి ఉన్నా లేకపోయినా ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

Tags

Read MoreRead Less
Next Story