అమ్మమ్మ చెప్పిన ఆరోగ్య సూత్రాలు.. ఆ రోజులు మళ్లీ రావంటూ..

అమ్మమ్మ చెప్పిన ఆరోగ్య సూత్రాలు.. ఆ రోజులు మళ్లీ రావంటూ..

పెంకుటిళ్లు.. పెద్ద కుటుంబాలు.. వాకిట్లో అమ్మ కళ్లాపి చల్లి ముగ్గుపెడితే ఎంత అందంగా ఉండేది. పేడ వాసన వస్తుందంటే.. అందుకే క్రిములు, కీటకాలు ఇంట్లోకి రావని చెప్పేవాళ్లు. ఇంటికి ఎవరైనా వస్తే కాళ్లు కడుక్కోడానికి నీళ్లిచ్చేవారు. కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కున్న తరువాతే ఇంట్లోకి వచ్చి కుండలోంచి తెచ్చి ఇచ్చిన మంచినీళ్లు తాగేవారు. వాకిట్లో ఉన్న వేపచెట్టు గాలి ఆక్సిజన్ అందించే ఆరోగ్యాన్ని ప్రదాయిని. వారానికోసారి వేప పుల్లతో పళ్లు తోముకుంటే కడుపులో ఉన్న నులిపురుగులు చచ్చిపోతాయని చెప్పేవారు.

కుంకుడు కాయలు, నాలుగు మందారాకులు కూడా వేసుకుని తల స్నానం చేయడం.. తలకి నూనె పెట్టాలంటే కొబ్బరి నూనె లేదా ఆముదం. అందుకే చుండ్రు అంటే ఏంటో కూడా తెలియదు అప్పుడు. దాంతో జుట్టు పట్టు కుచ్చులా మెరుస్తుండేది. వారానికోసారి కాళ్లకి పసుపు రాసుకోవడం.. పండగలు, పబ్బాలు వస్తే గడపలకి పసుపు, గుమ్మాలకి మామిడితోరణాలు.. పసుపు యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. వధూవరులకు నలుగు పెట్టి, పసుపు నీళ్ల స్నానం చేయించడం ఆనవాయితీగా వస్తుండేది.

కాస్త శరీరం నలతగా ఉండి.. ఒళ్లు నొప్పులుగా ఉంటే దొడ్లో ఉన్న వావిలాకు తీసుకువచ్చి వేడి నీళ్లలో మరిగించి స్నానం చేయమనేవారు. దాంతో కాస్త ఉపశమనంగా అనిపించేది. పిల్లలకు అమ్మవారు సోకితే వేపాకులు మంచం మీద వేసి దానిమీద పడుకోమనేవారు. చుట్టూ వేపాకులు ఉంచేవారు. చెప్పులు బయటే వదలడంతో క్రిములు ఇంటి లోపలికి వచ్చేవి కావు. గాలి, వెలుతురు, సూర్యరశ్మి తగులుతుండేవి శరీరానికి.

ఆహార పదార్థాలను రాగి, ఇత్తడి, మట్టి పాత్రల్లో వండేవారు. దాంతో పోషకాలు పుష్కలంగా అందేవి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే నిప్పుల మీద సాంబ్రాణి పొగ వేసి పాపాయికి పట్టేవారు. అన్నీ మంచి అలవాట్లే.. ఇన్షెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు తోడ్పడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే కరోనా మహమ్మారి లాంటి వైరస్ లు మనుషుల మీద దాడి చేసి ఇంతటి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. వైరస్ దాడిని తట్టుకునే శక్తి శరీరం కోల్పోతోంది.

Tags

Read MoreRead Less
Next Story