తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షల్లో అమ్మాయిలు సత్తా చాటారు. ఫస్ట్, సెకండ్ ఇంటర్‌లోనూ బాలికల హవానే కొనసాగింది. ఎప్పటిలాగే ఫలితాల్లో ప్రైవేటు కళాశాల హవా కొనసాగినా.. ఈ సారి.. ఏపీ, తెలంగాణలోనూ ప్రభుత్వ కళాశాల విద్యార్ధులు.. మంచి ఫలితాలు సాధించారు.
ఇంటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4,55,789 మంది పరీక్షలు రాయగా.. 2,84,224 మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు. అలాగే ఇంటర్ సెకండియర్‌లో 4,29,378 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 2,88,772 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 62.3, ద్వితీయ సంవత్సరంలో 67శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి వెల్లడించారు.
తెలంగాణలో ఎప్పటిలాగే ప్రథమ సంవత్సరంలో బాలికలు సత్తా చాటారు. బాలికలు 69 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 55.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత 73.25 శాతం కాగా.. బాలురు 61 శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌లో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, మహబూబాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలవగా.. ఇంటర్ సెకెండ్ ఇయర్లో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 80 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచింది. ఫలితాలపై విద్యార్థులకు ఏమైనా డౌట్స్ ఉంటే.. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తుకు ఏప్రిల్ 20 వరకు గడువు ఇచ్చారు.
ఇక ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లోనూ బాలికలు సత్తా చాటారు. 67 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఓవరాల్‌గా గతేడాది కంటే 2 శాతం ఉత్తీర్ణత తగ్గింది. 75 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో... 48 శాతంతో కడప చివర్లో నిలిచింది. మే 14 నుంచి సప్లిమెంటరీ నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఈసారి ప్రభుత్వ కాలేజీలు మంచి ప్రతిభ కనబర్చాయి.. ప్రభుత్వ కాలేజీల్లో చదివిని కొందరు విద్యార్థులు కార్పొరేట్ కాలేజీ విద్యార్థులతో పోటీ పడ్డారు..