Posted: 441 Days Ago
Views: 11476
మేనేజ్మెంట్ ఉద్యోగమంటూ ఒకరు, పెట్రోలు బంకులో నౌకరి అంటూ మరొకరు.. ఇలా ఇద్దరు సౌదీకి వచ్చి ఇరుక్కుపోయారు. ఒకరు తప్పు చేయకున్నా జైలు శిక్ష అనుభవించి బయటకు రాగా, మరొకరు ఎడారిలో ఒంటెలను మేపలేక పారిపోయి వచ్చి.. స్వదేశానికి పంపాలంటూ వేడుకుంటున్నారు. ఎబీఏ పట్టభద్రుడయిన హైదరాబాద్ రాంనగర్‌కు చెందిన పొన్నబోయిన స్వామిని సౌదీలో బడా కంపెనీలో మేనేజ్మెంట్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ దళారులు దగా చేశారు.
తీరా సౌదీకి వెళ్లిన స్వామికి.. అక్కడ తోటమాలిగా, కారు డ్రైవర్‌గా పనిచేసే ఉద్యోగమని తెలిసింది. దీంతో ఆ పనులు తాను చేయలేనని, తనను స్వదేశానికి పంపించాలని వేడుకున్నా.. అదేమీ పట్టని యజమాని తన దగ్గర పని చేయాల్సిందేనని స్వామిని బంధించాడు. ఎలాగోలా ఆ ఇంటి నుంచి పారిపోయిన స్వామిపై టీవీ సెట్టు దొంగతనం చేశాడని పోలీసు కేసు నమోదైంది. స్వదేశానికి వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్న స్వామిని రియాద్‌లో పోలీసులు అరెస్టు చేయగా.. 5 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. తన పూర్వీకుల ఆస్తి అమ్మి 10 వేల రియాళ్లు (సుమారు 2 లక్షల రూపాయలు) సౌదీలోని యజమానికి కోర్టు ద్వారా చెల్లించగా.. గత నెల 7వ తేదీన జైలు నుంచి స్వామి విడుదలయ్యాడు. అయితే అతని పేరు ఇంకా బ్లాక్ లిస్టులోనే ఉండడంతో స్వదేశానికి వెళ్లలేక నానా యాతన పడుతున్నాడు. కొద్ది వారాల్లో అతని పేరును ఆ లిస్టు నుంచి తొలగించనున్నట్లు సమాచారం. మరో కేసులో..
సౌదీలో పెట్రోలు బంకులో ఉద్యోగం ఉందని వెళ్లిన ఆదిలాబాద్ పట్టణంలోని దస్మపూర్కు చెందిన పద్న సంతోష్ కూడా మోసపోయాడు. సౌదీలో పని చేసే నిర్మల్ ప్రాంతానికి చెందిన రమణ అనే ప్రవాసీ వీసా పంపించగా.. సౌదీకి వచ్చిన సంతోష్ తబూక్ అనే మారుమూల ప్రాంతంలో ఎడారిలో ఒంటెల కాపరిగా పని చేయాల్సి వచ్చింది. జీతం చెల్లించకుండా, రెసిడెన్సీ వీసా (అఖమా) ఇవ్వకుండా సంతో్‌షతో చాకిరీ చేయించుకున్నారు.
అక్కడ ఉండలేక సంతోష్.. పారిపోయి పాకిస్తానీల సహాయంతో.. 850 కిలోమీటర్ల దూరంలోని జెడ్డాకు చేరుకున్నాడు. తనను స్వదేశానికి తిరిగి పంపించాలంటూ భారతీయ దౌత్య కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నాడు. దినమంతా దౌత్య కార్యాలయం చుట్టూ తిరుగుతూ.. రాత్రిపూట ఫుట్ పాత్‌పై పడుకుంటూ కాలం గడుపుతున్నాడు.