ఓం నమో వెంకటేశాయ రివ్యూ
నటినటులు: నాగార్జున, సౌరబ్‌జైన్, అనుష్క, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్, విమలా రామన్, రావు రమేష్, వెన్నెల కిషోర్, ప్రభాకర్, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
నిర్మాణం: సాయికృపా ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్
డైరెక్టర్: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: ఎ.మహేష్‌రెడ్డి
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాంకేతికం: ఎస్.గోపాల్‌రెడ్డి, జె.కె.భారవి, కిరణ్‌కుమార్ మన్నె, గౌతంరాజు
రిలీజ్ డేట్: 10 ఫిబ్రవరి 2017
భక్తులకు భగవంతుడే అంతా... అంతా తానే అయిన భగవంతుడుకి భక్తులే ఆటవిడుపు. కొన్ని తెలియని కథలు తెలిసినప్పుడు ఇలాంటి విషయాలు అనుభవంలోకి వస్తాయి. హాథీరామ్ బాబాగా తిరుమల కొండపై కొలువైన భక్తుడికి ఆ ఆపదమొక్కుల వాడికి మద్య జరిగిన కథ.. రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఆటవిడిపు లాంటిదే. తిరుమల కొండపై ఆచారాలు ఎలా వచ్చాయి.. వెంకేటశ్వరుడుకి బాలాజీ అనే పేరు ఎలా వచ్చింది.? భగవంతుడినే తన భక్తికి దాసుణ్ణి చేసుకున్న హాథీరామ్ కథలోని గొప్పతనం ఎంటనేది తెలుసుకుందాం..
కథ:
ఉత్తరభారతంలో రామ్ అనే బాలుడికి భగవత్ దర్శనం పై ఆసక్తి ఎక్కువ. తన గురువైన అనుభవానంద స్వామితో తన కోరికను చెబుతాడు. దేవుణ్ణి చూడాలంటే ఏ శాస్త్రం చదవాల్సిన అవసరం లేదు కానీ దేవుణ్ణి గుర్తించాలంటే మాత్రం శాస్త్రంతో అవసరం అని తన శిష్య బృందంలో చేర్చుకుంటాడు. అక్కడి నుండి భగవంతుడి సాక్షాత్కారం కోసం అప్పటి నుంచి తపస్సు చేస్తాడు రామ్. తన భక్తిని మెచ్చి బాలుడి రూపంలో వస్తాడు శ్రీనివాసుడు. రామ్ బాలుడిలో భగవంతుడ్ని చూడలేక తిరిగి పంపించేస్తాడు. అయితే తనకోసం వచ్చిన బాలుడే భగవంతుడని తన గురవుద్వారా తెలసుకొని.. ఆ భగవంతుడు తిరుమలలో కొలువై ఉన్నాడని తిరుమలకు వస్తాడు రామ్. అక్కడ రామ్ తిరుమలలో కొన్ని అపచారాలను గుర్తిస్తాడు.తన దైవంతో ఆడుకుంటాడు. మరి హాథారామ్ బాబాగా ఎలా మారాడు..? ఈ భక్తుడి జీవితం భగవంతునికి అత్యంత ఇష్టంగా ఎందుకు మారింది అనేది మిగిలిన కథ..?
కథనం:
నటనను ఇష్టపడటం, చేస్తున్న పాత్రగా పూర్తిగా మారిపోవడం అంటే ఎంటో నాగార్జునని చూస్తే అర్ధం అవుతుంది. భక్తుడిగా మరోసారి నాగ్ నట సామర్ధ్యం హాథీరామ్ బాబాగా మరోసారి తెలిసింది. రాఘవేంద్రరావు అన్నట్లు ‘‘ సౌరబ్ ని మాములుగా చూస్తే భగవంతుని గెటప్ లో కనపడతాడు, నాగ్ కళ్ళలోకి చూస్తే మాత్రం భగవంతుడు కనపడతాడు అనేది సినిమా చూసిన ప్రేక్షకులకు అనుభవంలోకి వస్తుంది. భగవంతుడు, భక్తుడు కంటే భక్తి గొప్పదని ఆ గొప్పదనానికి ఏడుకొండల వాడయినా కాలినడకన పరుగు పరుగున రావాల్సిందేనని ఈ కథతో మరోసారి తెలిసింది. పాత్రల పరిచయం నుండి రాఘవేంద్రరావు తీసుకున్న శ్రర్ద కనిపిస్తుంది. ప్రగ్యా జైస్వాల్ చాలా అందంగా కనిపించింది. నాగ్ తో పాడిన ‘‘ఆనందం ఎంతో ఎంతో ఆనందం’’ ప్రగ్యాతో పాటు ప్రేక్షకులకు కూడా ఆనందాన్ని పంచింది. వెంకటేశ్వరునికి జీవితం అర్పించిన భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క ఆహార్యం చాలా బాగుంది. ఆ పాత్రను ‘‘వేయి నామాల వాడా ...కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయుడా’’ అనే పాటతో పరిచయం చేయడం రాఘవేంద్రుని ప్రతిభకి నిదర్శనం. ఆ పాటతోనే ఒక్కసారిగా వళ్ళు పులకరించిపోతుంది.. తిరుమలవీధుల్లో ఉన్నామనే భావన కలుగుతుంది. అనుష్కకి ఇంతకంటే బెస్ట్ ఎంట్రీ ఉండదేమో.. ఆ పాటతోనే తిరుమలకు చేరిన భక్తుడు అక్కడ కొన్ని అపచారాలను రూపు మాపి.. ఇప్పుడు ఉనికిలో ఉన్న ఆచారాలను నియమిస్తాడు. భగవంతుడిని ఆరాధించేందుకు నియమాలను నియమించాలంటే ఆ భక్తుడి మనోబలం భక్తిబలం ఎంతో నాగార్జున తన కళ్ళలో పలికించాడు. భక్తిని ఒలికే ఆకళ్ళును చూస్తే ఏ హృదయంలో అయినా భక్తి భావం కలుగుతుంది. ఇక వేయినామాల వాడుగా సౌరభ్ జైన్ ఆహార్యం బాగుంది. ఇక స్వామితో భక్తుడు పాచికలు ఆడే సన్నివేశం... తన భక్తుడు కోసం పసివాడిగా మారి ఆటలు ఆడుకునేందుకు వచ్చిన హారిని చూస్తే ఆకథలో గొప్పదనం తెలుస్తుంది. ఆ ఆటల సమయంలో ధర్మం గురంచి దేవునికే భక్తుడు గుర్తు చేసే సన్నివేశం అద్భుతంగా ఉంది. తనకు కష్టం కలిగినా తన ధర్మాన్ని నిర్వర్తించడానికి వెనకడుగు వేయకూడదనే విషయం కథలో అద్భుతంగా మలిచాడు రాఘవేంద్రుడు. ఇంకా స్థల పురాణాన్ని పాట రూపంలో చెప్పే సన్నివేశంలో శ్రీనివాసుని రూపాలు భక్తులకు ఆద్యాత్మిక లోకాలకు తీసుకెళ్తాయి. ఎంతటి భగవంతుడు అయినా సతులతో జరిగే చిరు గొడవలు, అలకలు అపురూపంగా చిత్రీకరించారు దర్శకేంద్రుడు. విమలారామన్, అస్మితలకు పాత్రలకు న్యాయం చేసారు. ఇక అనుష్క కూడా వెంకటేశ్వరుని భక్తురాలిగా పాత్రలో ఒదిగిపోయింది. జగపతిబాబుతో చిత్రీకరించిన పాటలో తప్ప అనుష్క పాత చిత్రాల తాలూకు ఛాయలు పడకుండా ఈ పాత్రను పోషించింది. హాథీరామ్ బాబా జీవితంలో గొప్ప పాత్రగా మెలిగే ఈ పాత్ర కథలో కథనం లో గొప్ప మలుపులు తీసుకొస్తుంది. రావు రమేష్, రఘబాబు, బ్రహ్మానందం అండ్ జబర్దస్త్ గ్యాంగ్ కాస్త హాస్యం పండించారు. ఈ సినిమాకి ప్రధాన బలం నాగార్జున, కీరవాణి .. పాటలతో సినిమాని సన్నివేశాలకు జీవం పోసాడు కీరవాణి. యస్. గోపాలరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద అసెట్. ప్రతి ఫ్రెమ్ ని అందంగా తీర్చాడు. సౌరభ్ జైన్ వెంకటేశ్వరునిగా మెప్పించాడు. నిత్యకళ్యాణం స్వామికి ఎందుకు అచారాలుగా మారాయో వంటి విశిష్టమైన అంశాలు కాస్త ఆశ్చర్యపరుస్తాయి. భగవంతుడి కంటే భక్తుడు గొప్పవాడు అని భగవంతునిచే అనిపించే అంత భక్తుని కథ ఇదే.. భక్తికి మించిన శక్తి లేదని ఈ కథ మరోసారి నిరూపించింది. నటుడిగా నాగార్జున స్థాయిని పెంచిన సినిమా. దర్శకునిగా రాఘవేంద్రునికి మైలురాయిగా మిగిలిపోతుంది. ఇటువంటి కథలకు ఆయువు పోసిన నిర్మాత మహేష్ రెడ్డి తెలుగుసినిమా చరిత్రలో మంచి నిర్మాతగా మిగులుతాడు.
చివరిగా:
భక్తుని కథకు రాఘవేంద్రుడు రూపం ఇస్తే.. నాగార్జున ప్రాణం పోసాడు. ఇంటిల్లపాది చూడదగ్గ భక్తుని కథ.