Posted: 433 Days Ago
Views: 796
డాలర్ డ్రీమ్స్ తో అమెరికా వెళ్లిన ఆ యువకుడు, ఓ డ్రగ్స్ బానిస ఉన్మాదానికి బలయ్యాడు. శాంతాక్లారా కౌంటీలోని మిల్పితాస్ లో వంశీ చందర్ రెడ్డిని కాల్చి చంపిన డ్రగ్ ఎడిక్ట్ ను పోలీసులు అరెస్ట్ చేశారంటూ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ఈ మేరకు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారతీయ కాన్సులేట్ నుంచి సమాచారం అందిందని తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా తమ శాఖ ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు. వంశీ హత్య ఘటన తనను కలచి వేసిందని సుష్మా విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వంశీ భౌతిక కాయాన్ని స్వదేశానికి రప్పించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల వంశీ, MS చదవడానికి అమెరికా వెళ్లాడు. పార్ట్ టైమ్ జాబ్ డ్యూటీ ముగించుకుని తిరిగి వెళ్తుండగా, డ్రగ్స్ కు బానిసైన ఓ ఉన్మాది కాల్చిచంపాడు. ప్రతిభావంతులైన ఎందరో యువకులు గంపెడాశతో వెళ్లే దేశం అమెరికా. చాలా మందికి అది భూతల స్వర్గం. అయితే, ఆ దేశంలోని రెండు అవాంఛనీయ పరిస్థితులు వంశీ హత్యకు కారణమయ్యాయి. మితిమీరిన గన్ కల్చర్ కారణంగా భారతీయులతో పాటు చాలా మంది బలైపోయారు. డ్రగ్స్ మహమ్మారి అమెరికాలో భయంకరంగా విస్తరించడం కూడా అనేక నేరాలకు కారణమవుతోంది. మొత్తానికి, బాగా చదువుకుని మంచి జీవితం గడపాలనే ఆశతో అమెరికా వెళ్లిన ఈ యువకుడు, నిర్జీవంగా స్వస్థలానికి తిరిగి రాబోతున్నాడు. అమెరికాలో దండగుడి కాల్పుల్లో హత్యకు గురైన వంశీ మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్, వంశీ తండ్రితో చెప్పారు. తన కొడుకు హత్యకు కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని వంశీ తండ్రి సుష్మాను కోరారు.