Posted: 399 Days Ago
Views: 216
పాపులర్ సింగర్ బాలసుబ్రమణ్యానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అమెరికా టూర్లో ఉన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం తన అనుమతి లేకుండా పాటలు పాడకూడదంటూ ఇళయరాజా ఈ నోటీసులు పంపించారు. ఇప్పుడు కోలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై ఎస్పీబీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రెండు రోజుల క్రితం తనకు ఈ నోటీసులు అందినట్లు ఎస్పీబీ వెల్లడించారు. తనకే కాకుండా సింగర్స్ చిత్ర, చరణ్‌తో పాటు ఈవెంట్ ఆర్గనైజర్లకు లీగల్ నోటీసులు అందాయట.
అయితే తన కొడుకు ఈ వరల్డ్ టూర్ ప్లాన్ చేశాడని, ఎస్పీబీ50 అనే పేరుతో ఆగస్ట్‌లో టొరంటో, రష్యా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, దుబాయ్‌తో పాటు ఇండియాలోని పలు చోట్ల కూడా ప్రదర్శనలిచ్చామని ఎస్పీబీ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఇళయరాజా నుంచి తనకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని తెలిపారు. కానీ అమెరికా టూర్లో ఉన్నప్పుడు మాత్రమే ఇళయరాజా ఎందుకిలా స్పందించారో తెలియడం లేదని పోస్ట్ చేశారు. తనకు ఇలా పాడితే చట్టపరమైన అడ్డంకులు ఉంటాయని తెలియదని, అందుకే తన ట్రూప్ ఇక ఇళయరాజా పాటలు పాడబోదని ఎస్పీబీ స్పష్టం చేశారు. దేవుడి దయ వల్ల ఇతర సంగీత దర్శకుల పాటలు ఎన్నో పాడానని, వాటినే ఈ ఈవెంట్లో ఆలపిస్తానని ఎస్పీబీ వెల్లడించారు. అయితే తాను వెల్లడించిన ఈ విషయంపై ఎలాంటి కఠినమైన, ఎదుటి వారిని నొప్పించే కామెంట్స్ పెట్టొద్దని ఎస్పీబీ పోస్ట్ చేశారు.