Posted: 368 Days Ago
Views: 533
కాసేపట్లో కొంపల్లి వేదికగా టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం కానుంది. టీఆర్ఎస్ శ్రేణుల్లో పండుగ వాతావరణం ఉంది. ఎటుచూసినా తోరణాలు, హోర్డింగులతో గులాబీమయంగా మారిపోయింది. 16వేల మంది ప్రతినిధులకు తెలంగాణ ప్రగతి ప్రాంగణం స్వాగతం పలుకుతోంది. మరోసారి అధినేతను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఏడు తీర్మానాలపై చర్చించనున్నారు. ప్లీనరీలో గులాబీ సైనికులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం అమరవీరులకు శ్రద్దాంజలి ఘటిస్తారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు హోంమంత్రి నాయిని ప్రకటిస్తారు. అధ్యక్షుని హోదాలో కేసీఆర్ ప్రారంభోపన్యాసం ఉంటుంది. ఆ తర్వాత ఏడు తీర్మానాలపై.. ఏడుగురు తీర్మానాలు పెడతారు. ఈసారి మంత్రులు కాకుండా కొండ సురేఖ, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వినోద్ కుమార్, నారదాసు లక్ష్మణ్, పాయం వెంకటేశ్వర్లు తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మూడేళ్లలో సాధించిన ప్రగతిపై ప్రధానంగా చర్చించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు భోజన విరామం. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత తీర్మానాలపై చర్చ ఉంటుంది. సాయంత్రం ఐదున్నర గంటలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రతినిధులను ఉద్దేశించి ముగింపు ఉపన్యాసం చేస్తారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం. ప్లీనరీ ప్రాంతంలో గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మలతో రూపొందించిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వేదికకు ముందు భాగంలో చిత్రమాలిక స్వాగత తోరణాలు ఆకట్టుకునేలా ఏర్పాటుచేశారు. కొంపల్లి ప్రాంగణానికి చేరుకునే దారిలో అక్కడక్కడ నెలకొల్పిన విభిన్న స్వాగత తోరణాలు చూడముచ్చటగా ఉన్నాయి.