జగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ

జగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని అమరావతి ప్రాజెక్టుకు రుణమివ్వరాదన్న ప్రపంచ బ్యాంకు నిర్ణయం బాటలోనే మరో అంతర్జాతీయ ద్రవ్య సంస్థ కూడా నడిచింది. తాము కూడా అప్పు ఇవ్వబోవడం లేదని ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. ఏఐఐబీ.. చైనా ఆర్థిక సహాయంతో నడిచే సంస్థ. ప్రపంచ బ్యాంక్‌తో కలసి రాజధానికి రుణమిచ్చే విషయాన్ని గత కొంతకాలంగా ఇది చురుగ్గా పరిశీలిస్తోంది. అయితే ఇటీవల ప్రపంచ బ్యాంక్‌ అమరావతి ప్రాజెక్ట్‌పై వెనక్కి తగ్గింది. రుణం ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయంతో 2 వేల కోట్లు వచ్చే వీల్లేకుండా పోయింది. ఇప్పుడు ఏఐఐబీ రుణం ఇవ్వడానికి నిరాకరించడంతో 1360 కోట్లు ఆగిపోనున్నాయి.

అంతర్జాతీయ సంస్థలు రుణాలు ఇవ్వడానికి నిరాకరించడంతో అమరావతి నిర్మాణం సందిగ్ధంలో పడింది. అసలే కేంద్ర ప్రభుత్వం నిధులేమీ ఇవ్వక సహాయ నిరాకరణ చేస్తోంది. దీనివల్ల ఇబ్బందులు పడుతున్న అమరావతికి, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అమరావతి నిర్మాణానికి దాదాపు లక్ష కోట్లు అవసరమని గత ప్రభుత్వం అంచనా వేసింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనందున, ఇందుకయ్యే వ్యయంలో గణనీయమైన మొత్తాన్ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని దాదాపు ఐదేళ్లపాటు అభ్యర్థించింది. అయితే కేంద్రం కేవలం ప్రకటనలకే పరిమితమైంది తప్ప నిధులను అరకొరగానే విడుదల చేసింది.

కేంద్రం పట్టించుకోకపోయినా చంద్రబాబు రాజధాని నిర్మాణాన్ని ఒక సవాలుగా తీసుకున్నారు. ఒకపక్క.. కేంద్రాన్ని సహాయం కోసం అభ్యర్థిస్తూనే, మరోపక్క రాజధాని నిర్మాణానికి సీఆర్డీయే ద్వారా వివిధ మార్గాల్లో నిధుల సమీకరణకూ ప్రయత్నించారు. సీఆర్డీయే రాజధానిలోని భూములను విక్రయించడం వంటి మార్గాల ద్వారా పూర్తిస్థాయిలో నిధులు సమీకరించుకుంటూనే.. మరొకపక్క వివిధ జాతీయ, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు, బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు గత నాలుగేళ్లుగా ముమ్మర కృషి చేసింది. అందులో భాగంగానే ప్రపంచ బ్యాంక్‌, ఏఐఐబీలను సంప్రదించింది. మన దేశంలోని హడ్కో, వివిధ బ్యాంకులతో కూడిన కన్సార్షియం వంటి పలు ద్రవ్య సంస్థలను ఆశ్రయించింది. అమరావతి మాస్టర్‌ ప్లాన్లను, భవిష్యత్తులో అది ఎదగబోయే క్రమాన్ని సునిశితంగా పరిశీలించి, సంతృప్తి చెందిన పలు ద్రవ్య సంస్థలు, బ్యాంకులు రుణాలిచ్చేందుకు అంగీకరించాయి. హడ్కో ఇప్పటికే తాను ఇవ్వాలనుకున్న రుణంలో కొంత విడుదల చేసింది కూడా. మన దేశంలోని వివిధ బ్యాంకుల కన్సార్షియం సైతం నేడో, రేపో రుణాన్ని ఇవ్వబోతున్నాయి. ఇంతలోనే ప్రపంచ బ్యాంక్‌, ఏఐఐబీ రాజధానికి రుణమివ్వరాదని నిర్ణయించడం.. ఈ సంస్థల నిర్ణయంపై ప్రభావం చూపవచ్చునని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story