ఏపీకి గుడ్‌బై చెప్పే యోచనలో అమరరాజా

ఏపీకి గుడ్‌బై చెప్పే యోచనలో అమరరాజా
Amara Raja Industry: అమరరాజా బ్యాటరీస్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకోడానికైనా వెనకాడడం లేదని తెలుస్తోంది.

Amara Raja Industry: అమరరాజా బ్యాటరీస్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకోడానికైనా వెనకాడడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకైతే కొత్త ప్లాంట్‌ను ఏపీలో పెట్టకూడదని ఓ నిర్ణయానికొచ్చారు. అవసరమైతే ఉన్న ప్లాంట్‌ను సైతం తీసేసి వేరే రాష్ట్రానికి వెళ్లడానికైనా సిద్ధం అనే సంకేతాలు పంపించింది. వేధింపులను భరిస్తూ ఉండాల్సిన అవసరం లేదని ఫ్యాక్టరీ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది.

నిజానికి గత ఏప్రిల్‌లోనే ప్లాంట్‌ మూసేయమంటూ డైరెక్టుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నోటీసులు పంపింది. హైకోర్టు స్టే ఇవ్వడంతో యథావిధిగా కొనసాగుతోంది. అయినప్పటికీ.. సంస్థపై వేధింపులు ఆగలేదని తెలుస్తోంది. రెండు రోజులకో డిపార్ట్‌మెంట్ అధికారులు వచ్చి, తనిఖీలు చేయాలంటూ వేధిస్తున్నారని సంస్థ చెబుతోంది. మొదట పొల్యూషన్ బోర్డ్ వచ్చింది, తరువాత కార్మిక శాఖ, ఆ తరువాత పంచాయతీరాజ్‌, ఆరోగ్య శాఖ, చివరికి ఇరిగేషన్‌ డిపార్ట్‌ మెంట్ కూడా వచ్చింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు కరకంబాడిలోని అమరరాజా ఫ్యాక్టరీకి వెళ్లి, తనిఖీలు చేస్తుండడంతో.. తాము కూడా విసిగిపోయామని సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

అమరరాజా ఎక్స్‌టెన్షన్ ప్లాంట్‌ కోసం వైఎస్ హయాంలో భూమి కేటాయించారు. బంగారుపాళ్యం వద్ద రాళ్లు, రప్పలతో నిండిన ప్రాంతాన్ని ఇవ్వడంతో.. దాన్నే నెమ్మదిగా చదును చేసుకుంటూ నిర్మాణ పనులు చేపట్టారు. జగన్ సర్కారు రాగానే వైఎస్‌ హయాంలో ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుంటూ నోటీసులు ఇచ్చారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తికాలేదన్న కారణం చూపుతూ భూమిని వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

జరుగుతున్న పరిణామాలపై అమరరాజా బ్యాటరీస్ వ్యవస్థాపకులు రామచంద్రనాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఇక్కడే ఎక్స్‌టెన్షన్ ప్లాంట్‌ పెట్టడం అనవసరం అనే ఆలోచనకు వచ్చినట్టు వార్తలొచ్చాయి. ఇలా వార్తలు వచ్చాయో లేదో వెంటనే స్టాలిన్ నుంచి కబురు వచ్చిందనే టాక్ నడుస్తోంది. ఏమాత్రం ఇబ్బంది ఉన్నా తమిళనాడుకు వచ్చేయండని ఆఫర్ ఇచ్చారని వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ వేధింపులు ఆగకపోతే.. ఉన్న ప్లాంట్‌ను తరలించినా ఆశ్చర్యం లేదని ఫ్యాక్టరీ వర్గాలు అంటున్నాయి.

చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీస్ ముందు ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. రాజకీయ కక్ష కారణంగానే పరిశ్రమ తరలిపోతోందంటూ ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కంపెనీ తరలిపోకముందే జగన్ స్పందించాలంటూ నినాదాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story